11 August, 2026 | 4:05 AM

పేదల జోలికొస్తే ఖబడ్దార్!

11-08-2026 12:00 AM
  1. ఇంచు భూమి కూడా పోనివ్వ
  2. రాజేంద్రనగర్ భూబాధితులకు టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న భరోసా 

రాజేంద్రనగర్, ఆగస్టు 10 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా నివసిస్తున్న 300 పేద కుటుంబాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అండగా నిలిచారు. బాధితులకు ధైర్యం చెబుతూ, వారి హక్కుల కోసం తాను ఎందాకైనా వెళ్లడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. సోమవారం వారితో సమావేశమై, భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని మల్లన్న గుర్తు చేశారు.

అయినప్పటికీ, రాజేంద్రనగర్ పోలీసులు రియల్ ఎస్టేట్ మాఫియా, పక్కనే ఉన్న విల్లా యజమానుల దగ్గర డబ్బులు తీసుకుని, గుండాలతో జతకట్టి పేదలను వేధిస్తున్నారని, పోలీసులే గుండాలను పెట్టి ప్రజలను కొట్టడం, ఇళ్ల నుంచి తరిమేయడం వంటి కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కోర్టు తీర్పును ధిక్కరించి పోలీసులు భూముల్లోకి వస్తే, వారి పేర్లను వీడియో తీసి పెట్టాలని, స్వయంగా తానే వారిపై హైకోర్టులో కేసులు వేయిస్తానని హెచ్చరించారు.

మీ భూమిలో నుంచి ఇంచు భూమి కూడా పోనివ్వనని, నేను మీకు అండగా ఉన్నానని భరోసా ఇచ్చారు. పోలీసులు లేదా గుండాలు అర్ధరాత్రి వేళ వచ్చినా సరే, ఒక్క ఫోన్ కాల్ చేస్తే తాను రాత్రి 2 గంటలకైనా నేరుగా అక్కడికి చేరుకుంటానని హామీ ఇచ్చారు. గతంలో గౌలిదొడ్డి వద్ద పేదల భూములను కబ్జా చేయడానికి గుండాలు ప్రయత్నించినప్పుడు, తానే స్వయంగా వెళ్లి అక్కడ కట్టిన షీట్లను తన్ని పడేశానని మల్లన్న గుర్తు చేశారు. భూ సమస్యపై సైబరాబాద్ సీపీకి, హోమ్ సెక్రటరీకి, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు అందజేస్తున్నట్లు మల్లన్న తెలిపారు.