రైతన్నలూ.. దుక్కులు దున్నండిలా
వరంగల్, మే 30(విజయక్రాంతి): వానకాలం పంటల సాగుకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో రైతులు దుక్కులు దున్నేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో గతంలో కంటే ముందుగానే వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే దుక్కులు దున్నిస్తున్నారు. అయితే వ్యవసాయ సాగులో పంటల దిగుబడి, భూగర్భ నీటిమట్టం పెరగడం, చీడపీడల నివారణలో దుక్కి దున్నడం కూడా కీలకంగా మారిన నేపథ్యంలో లోతుగా దున్న డం ద్వారా రైతులకు ఎన్నో ప్రయోజనాలుంటాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతు న్నారు. పంటలను ఆశించే తెగుళ్లు, కలుపు మొక్కలను నివారించొచ్చని పేర్కొంటున్నారు.
వేసవి దుక్కులతో ఎంతో మేలు: డాక్టర్ రాజు, శాస్త్రవేత్త
రైతులు తొలకరితో వేసవి దుక్కులు దున్నడం ద్వారా తర్వాత పడే వర్షపు నీరు బయటకు వెళ్లకుండా భూమిలోకి ఇంకుతుంది. లోతుగా దున్నడంతో భూమి పై పొరలు, కింది పొరలు తిరగబడి నేల సారవంతమవుతుంది. చేలలోని చెత్త, ఆకులను కాల్చకుండా లోతుగా దున్నినట్లయితే సేంద్రియ పదార్థంగా మారుతుంది. కలుపు మొక్కల ఉధృతి తగ్గుతుంది.






