12-09-2025 01:32:46 AM
-ఓఆర్‌ఆర్ బయటకు కాలుష్యకారక పరిశ్రమలు
-తరలింపునకు రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
-సెక్టార్ల వారీగా పదివేల పరిశ్రమల గుర్తింపు
-3 వేలకుపైగా రెడ్ క్యాటగిరీ ఫ్యాక్టరీలే
-‘ఔటర్’ బయట ఏర్పాటుకు చర్యలు
-కాలుష్య నియంత్రణపై సర్కార్ దృష్టి
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): ప్రపంచస్థాయి నగరాలకు ధీటుగా ఎదుగుతున్న హైదరాబాద్‌ను అత్యంత సుం దరమైన, నివాస యోగ్యమైన నగరంగా తీర్చిదిద్దాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మూసీ పునరుజ్జీవం పథకాన్ని ప్రారం భించింది.
మూసీని ప్రక్షాళించాలంటే ముం దుగా నదిలో కలుస్తున్న కాలుష్య కారకాలను నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోం ది. దీంతోపాటు హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న గాలి, నీటి కాలుష్యాన్ని తగ్గించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో కాలుష్యానికి కారణమ వుతున్న పరిశ్రమలను గుర్తించే పనిలో పడింది. ఆయా రంగాల్లోని కాలుష్య కారక పరిశ్రమలను గుర్తించి వాటిని ఓఆర్‌ఆర్ బయట ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఆ దిశగా చర్యలు చేపట్టింది. అత్యంత కాలుష్యానికి కారణమవుతున్న 10 వేల పరిశ్ర మలను ఇప్పటికే గుర్తించింది. వీటిలో 3 వేలకుపైగా రెడ్ క్యాటగిరీకి చెందిన పరిశ్రమలు ఉండటం గమనార్హం. అయితే కాలు ష్య కారక పరిశ్రమలను దశల వారీగా ఓఆర్‌ఆర్ బయటకు తరలించేందుకు రంగం సి ద్ధం చేస్తున్నది. నగరం పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించి, ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక జోన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తుంది.
కాలుష్య కారక రంగాలు..
కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగం గా రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను గుర్తించింది. ముఖ్యంగా ఫా ర్మాస్యూటికల్స్, బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఎక్కువగా జీడిమెట్ల, బాలా నగర్, కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నా యి. కెమికల్ ఇండస్ట్రీలు పటాన్‌చెరు, బొల్లా రం, నాచారం ప్రాంతాల్లో ఉన్నాయి.
ఎలక్ట్రో ప్లేటింగ్, డైయింగ్ యూనిట్లు ఎక్కువగా జీడిమెట్ల, ఐడీఏ నాచారం ప్రాంతాల్లో ఉన్నా యి. బ్యాటరీ రీసైక్లింగ్, మెటల్ వర్క్స్ వంటి పరిశ్రమలు కాటేదాన్, బాలానగర్, బహదూర్‌పల్లి ప్రాంతాల్లో ఉండగా, ప్లాస్టిక్ రీసై క్లింగ్ యూనిట్లు చర్లపల్లి, కాటేదాన్ ప్రాం తాల్లో ఉన్నట్టు అధికారులు గుర్తించా రు. అయితే మొత్తం కాలుష్య కారక పరిశ్రమల్లోని 3,198 రెడ్ క్యాటగిరీ పరిశ్రమలను త్వ రితగతిన తరలించడంపై తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దృష్టి సారించింది.
తరలింపులో సవాళ్లు..
నగరంలోని పరిశ్రమల వ్యర్థాల కారణం గా పర్యావరణం దెబ్బతినడంతోపాటు నీటి వనరులు కలుషితమవుతున్నాయి. తద్వారా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ క్రమంలోనే జీడిమెట్ల, నాచారం, బాలానగర్, కాటేదాన్, పటాన్‌చెరు, బొల్లా రం ప్రాంతాల్లోని కాలుష్య కారక పరిశ్రమలను వీలైనంత త్వరగా తరలించాలని స్థాని కులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే కాలుష్యానికి కారణమవుతున్న ఆయా పరిశ్రమల తరలింపులోనూ ప్రభుత్వానికి పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిలో ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలను తరలించే ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది. దీంతోపాటు నగరానికి వెలుపల ప్రభుత్వం చేప ట్టిన ఫార్మా సిటీ ఏర్పాటుకు కావాల్సిన భూసేకరణలో జాప్యం జరగడంతోపాటు ఇండస్ట్రీయల్ అసోసియేషన్ల నుంచి న్యాయపరమైన సవాళ్లు, పరిశ్రమలను తరలించేం దుకు విముఖత ఎదురవుతోంది.
ప్రభుత్వ లక్ష్యం..
కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్‌ఆర్ బయటకు తరలించి నగరంలో గ్రీన్ స్పేసెస్, ఐటీ హబ్స్, రెసిడెన్షియల్ జోన్లు, ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా ఇండస్ట్రీయల్ జోన్ల ను బలోపేతం చేసి, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్లు, ఘన, వ్యర్థాల నిర్వహణ ప్లాం ట్లను ఏర్పాటు చేయనున్నది. ఎప్పటికప్పుడు గాలి, నీరు, భూమి కాలుష్యంపై సెన్సార్ల సహాయంతో పర్యవేక్షించ నుంది.. ప్రజల సౌకర్యార్థం పొల్యూషన్ డేటాను ప్రదర్శించేందుకు డ్యాష్‌బోర్డులను సైతం ఏర్పాటు చేయనున్నది.
గ్రీన్ ఇండస్ట్రీస్, ఐటీ, ఆర్‌అండ్‌డీ, ఈవీ మ్యా నుఫ్యా క్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూ నిట్ల ఏర్పాటుపై దృష్టి సారించనుంది. కాలుష్య కారక పరిశ్రమల యాజమాన్యాలు ఆయా పరిశ్రమల ద్వారా జరు గుతున్న నష్టాన్ని నివారిం చేందుకయ్యే వ్యయాన్ని చెల్లించేలా పాలసీని రూపొందించనున్నారు. భవిష్యత్‌లో అడ్డదారిలో కాలుష్య కారక పరిశ్రమలు ఓఆర్‌ఆర్ పరిధిలోకి రాకుండా పారదర్శకంగా ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు గ్రీన్ ట్రిబ్యూనల్, పీసీబీ అధికారాలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.