12-09-2025 01:11:05 AM
-నాణ్యమైన విత్తనాల తయారీలో ఉమ్మడి భాగస్వామ్యం
-ఇండో సీడ్ సమ్మిట్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): భారత్, ఆఫ్రికాలకు వ్యవసాయ రంగమే ప్రధాన ఆదాయ వనరు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడి పని చేసే రెండు ఖండాలను కలిపే వారధి ఈ సమ్మిట్ అని తెలిపారు.
ఇండియన్ చాంబర్ ఆఫ్ పుడ్ అండ్ ఆగ్రికల్చర్, ఆఫ్రికన్ సీడ్ ట్రేడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియా ఆఫ్రికా సీడ్ సమ్మిట్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ సమ్మిట్ ఇరుదేశాల మధ్య వ్యవసాయరంగంలో సంబంధాలను బలోపేతం చేసే వేదికగా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం వాణిజ్యం ద్వారానే కాకుండా, సీడ్ డిప్లొమసీ ద్వారా విశ్వాసాన్ని పెంపొందించడం, శాస్త్ర పరిజ్ఞానం పంచుకోవడం, సుస్థిరమైన వ్యవసాయానికి భవిష్యత్‌లో కలిసి పనిచేయడం కోసం ఈ వేదిక ఒక వారధిగా నిలుస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు.
భారతదేశం గ్రీన్ రివల్యూషన్ ద్వారా ప్రపంచంలోనే తొలిసారిగా ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధిని సాధించిందని, ఆ విజయానికి మూలం నాణ్యమైన విత్తనమని చెప్పారు. ఆఫ్రికా ఖండంలో ప్రధానంగా మొక్కజొన్న, జొన్న, సజ్జ వంటి పంటలు పండుతున్నప్పటికీ, అనేక మంది రైతులు ఇప్పటికీ వాళ్లు దాచుకొన్న పంటలో కొంత ధాన్యాన్ని విత్తనంగా వాడుతున్నారని, ఇది ఉత్పాదకతను తగ్గించే అంశమని తెలిపారు.
ఆఫ్రికా దేశాలకు సస్యశ్యామలమైన నేలలు, అనుకూల వాతావరణం ఉన్నందున సరైన సమయంలో సరైన విత్తనాలను అక్కడి రైతులకు అందించడం అత్యవసరమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ భారతదేశపు సీడ్ హబ్‌గా అవతరించిందని, దేశ అవసరాల్లో 60 శాతం విత్తనాన్ని తెలంగాణ నుంచి సరఫరా చేయడమే కాకుండా, 20కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. వెయ్యికి పైగా విత్తన కంపెనీలు, ఆధునిక పరిశోధన, ప్రాసెసింగ్, నిల్వ సదుపాయాలతో పాటు కఠినమైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్ల తెలంగాణ విత్తనాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు.
రాష్ర్టంలో అమలు చేస్తున్న రైతు భరోసా, రైతుల ఖాతాలో నేరుగా సబ్సిడీ జమ చేయడంతో పాటు రైతు తనకు నచ్చిన నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నామని వివరించారు. ఆఫ్రికా దేశాలు సైతం ఇలాంటి విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నాణ్యమైన విత్తనాల వినియోగం పెరిగి ఉత్పాదకత, ఆహార భద్రత గణనీయంగా మెరుగుపడుతుందని మంత్రి సూచించారు.
ఆఫ్రికా విత్తన మార్కెట్ విలువ దాదాపు 3.99 బిలియన్ డాలర్లుగా ఉందని, భారత్ భాగస్వామ్యం ద్వారా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, రైతులు, పరిశోధకులు, విత్తన సంస్థలు కలిసి లాభపడొచ్చని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.