24-12-2025 03:32:35 PM
కోదాడలో విషాద ఘటన
కోదాడ: కోదాడ పట్టణంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. టీ తాగేందుకు వెళ్లిన వ్యక్తి ఇంటికి తిరిగి చేరకముందే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, బంధువులు తెలిపిన కథనం ప్రకారం… కోదాడ మండలం ద్వారకుంట గ్రామానికి చెందిన జక్కుల శివ (48) ప్రతిరోజు మాదిరిగానే ద్విచక్ర వాహనంపై కోదాడ పట్టణానికి టీ తాగేందుకు బయల్దేరాడు. ఈ క్రమంలో కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్దకు చేరుకున్న సమయంలో మేళ్లచెరువు వైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న శివ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో శివకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. రహదారిపై వాహనాల వేగ నియంత్రణ లేకపోవడమే ఇటువంటి ప్రమాదాలకు కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.