calender_icon.png 10 December, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ ఫ్యూచర్ సిటీతో 13 లక్షల మందికి ఉద్యోగాలు

10-12-2025 02:58:21 AM

  1. 13,500 ఎకరాల్లో భవిష్యనగరం
  2. 9 లక్షల జనాభాకు ఆవాసం
  3. ఆరు అర్బన్ జిల్లాలుగా ఏర్పాటు
  4. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): దేశీయ, అంతర్జాతీయ పెట్టు బడులను ఆకర్షించే ప్రపంచ స్థాయి నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. అద్భుతమైన మౌలిక వసతులతో ఏర్పాటయ్యే ఈ నగరాన్ని 13,500 ఎకరాలలలో జీరో కార్బన్ సిటీగా రూపొందించనున్నట్టు తెలిపారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ, యాజ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ 3 ట్రిలియన్ డాలర్స్ తెలంగాణా’ అనే అంశంపై ప్రభుత్వ ప్రణాళికలను మంగళవారం ఆయన గ్లోబల్ సమ్మిట్‌లో వివరించారు.

భవిష్యత్ నగరాన్ని ఆరు అర్బన్ జిల్లాలుగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ సిటీ, ఎంటర్ టెయిన్ మెంట్, క్రీడలు, డేటా సెంటర్స్, అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థల జిల్లాలుగా మొత్తం ఆరింటిని నెలకొల్పనున్నట్టు శ్రీధర్ బాబు చెప్పారు. ‘ఇక్కడ ఏర్పాటయ్యే వివిధ పరిశోధన సంస్థలు, గ్రీన్ ఫార్మా, మ్యాన్యుఫాక్చరింగ్, ఎంటర్ టెయిన్ మెంట్ జోన్ల ద్వారా మొత్తం 13 లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి.

9 లక్షల జనాభా కోసం నివాస గృహాల సముదాయాలు ఏర్పాటు చేస్తాం. మరో నెల రోజుల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. డేటా సెంటర్ల కోసం 400 ఎకరాలు కేటాయిస్తున్నాం. వచ్చే ఫిబ్రవరి చివరలో ఇక్కడ నిర్మాణాలు మొదలవుతాయి. ఫ్యూచర్ సిటీ అంతా ఒక ఆర్కిటెక్చరల్ అద్భుతంగా నిలుస్తుంది. అర్భన్ ఫారెస్టులతో అంతా పచ్చదనం పర్చుకుని కనిపిస్తుంది. వన్ తారా వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రిలయన్స్ ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకుంది’ అని పేర్కొన్నారు. 

‘లైఫ్ సెన్సైస్’లో రూ.63 వేల కోట్లు

గడచిన రెండేళ్లలో ఒక్క లైఫ్ సెన్సైస్ రంగంలోనే రూ.63 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్‌లో ఫ్యూచర్ సిటీపై జరిగిన చర్చాగోష్ఠిలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ గ్లోబల్ వ్యాక్సిన్స్ కేంద్రంగా అవతరించిందని ఆయన వివరించారు. కరోనా సమయంలో ప్రపంచం మొత్తానికి తాము అండగా నిలిచామని తెలిపారు. వంద బిలియన్ డాలర్ల విలువైన 2,000 ఫార్మా కంపెనీలు రాష్ర్టంలో ఉన్నాయని ఆయన వెల్లడించారు.

ప్రపంచంలో పది పెద్ద ఫార్మా కంపెనీల్లో 8 తెలంగాణాలో ఉన్నాయని అన్నారు. గత 30 ఏళ్లుగా పాత ప్రభుత్వాలు అమలు చేసిన విధానాల కొనసాగింపు జరుగుతోందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి లైఫ్ సెన్సైస్ యూనివర్సిటీ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఇండస్ట్రీ పెద్దల భాగస్వామ్యంతో నిపుణులైన వర్క్ ఫోర్స్ ను తయారు చేస్తామని చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కూడా పరిశ్రమల భాగస్వామ్యంతోనే ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 

‘బ్లూ -గ్రీన్ ఎకానమీ’ క్యాపిటల్ గా తెలంగాణ

తెలంగాణను ‘బ్లూ -గ్రీన్ ఎకానమీ క్యాపిటల్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఆ దిశగా ఓ వైపు బ్లూ, గ్రీన్ ఎకానమీకి ఊతమిచ్చేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూనే... మరోవైపు మూసీ పునరుజ్జీవనం, హైడ్రా, నెట్ జీరో సిటీ భారత్ ఫ్యూచర్ సిటీ లాంటి దార్శనికతతో కూడిన విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు.

గ్లోబల్ సమ్మిట్‌లో ‘మూసీ పునరుజ్జీవనం అండ్ బ్లూ  గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు. భావితరాల కోసమే కాలుష్యంతో కంపు కొడుతున్న మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామన్నారు. గోదావరి నీటిని మూసీకి తరలించి గొప్ప జీవనదిగా మార్చేలా బృహత్తర ప్రణాళికలు రూపొందించామన్నారు.

చెరువులు, కుంటలను కబ్జా కోరల్లో నుంచి రక్షించి వాటికి పునరుజ్జీవనం కల్పించాలనే సంకల్పంతోనే ‘హైడ్రా’కు శ్రీకారం చుట్టామన్నారు. “కొత్వాల్ గూడ”లో 85 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఎకో పార్కు అరుదైన 19 రకాలకు చెందిన 8 వేల పక్షులకు ఆవాసంగా మారిందన్నారు.