గోకుల్ ప్లాట్స్‌లో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ
13న పూజ కార్యక్రమం
హాజరు కానున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి
కూకట్‌పల్లి, ఆగస్టు 12: పట్టణ పేదలు, అల్పాదాయ కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనుంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌సాయి హిల్స్ సమీపంలోని ప్రైమ్ స్థలంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి గురువారం భూమిపూజ నిర్వహించనున్నారు.
ఆగస్టు 13న సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి, రెవెన్యూహౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరు కానున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, టీజీవైకేసీఎస్సీ చైర్మన్ రఘునాథ్ యాదవ్ లు పిలుపునిచ్చారు. సమావేశ స్థలాన్ని బండి రమేష్ బుధవారం పరిశీలించారు.
5.87 ఎకరాల్లో నాలుగు టవర్లు..
కేపీహెచ్బీ ఫేజ్ 7, 9 మరియు గోకుల్ ఫ్లాట్స్ మధ్యలోని హౌసింగ్ బోర్డు భూమి లో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. మలేషియ న్ టౌన్షిప్ ఎదురుగా ఉన్న ఈ స్థలంలో 5.87 ఎకరాల్లో నాలుగు టవర్లు నిర్మించనున్నారు. ఫేజ్-1లో 480 ఇళ్లు, ఫేజ్-2లో 600 ఇళ్లు (మొత్తం సుమారు 1,080) నిర్మాణం జరుగుతుంది. ఒక్కో టవర్కు రూ. 10.80 కోట్లు చొప్పున మొత్తం సుమారు రూ. 43 కోట్లు ఖర్చు అవుతుంది. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. హౌసింగ్ బోర్డు 47 ఏళ్ల చరిత్రలో టవర్ ఫార్మాట్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడం ఇదే తొలిసారి.






