23-04-2025 12:41:18 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి శాసన సభ్యుడు తూడి మేఘారెడ్డి
గోపాల్ పేట / రేవల్లి, ఏప్రిల్ 22 : గత ప్రభుత్వం 18 లక్షల ఎకరాల భూమిని మాయం చేసి తీసుకొచ్చిన మాయదారి ధరణి చట్టాన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బంగాళ ఖాతంలో వేయడం జరిగిందని, ధరణి స్థానంలో రైతులకు మేలు చేసే రైతు పక్షపాతి అయిన భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు.
మంగళవారం గోపాల్ పేట, రేవల్లి , ఎదుల మండల రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం - 2025 అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి చట్టం ద్వారా ఏర్పడిన సమస్యలు ఏమిటి, భూ భారతి చట్టం వల్ల కలగనున్న లాభాలు ఏమిటి అనేది తెలుసుకోవడానికి ప్రతి మండలంలో రైతులతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ధరణి చట్టం ప్రకారం తహసిల్దార్ ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తే అందులో తప్పులు ఉన్నా, ఏ సమస్య ఉన్న తిరిగి సరి చేసేందుకు తహసీల్దార్ కు గానీ, ఆర్డీఓ లేదా కలెక్టర్ కు సైతం అధికారం లేకుండా ఉండేదని గుర్తు చేశారు. అన్నదమ్ముల మధ్య గొడవలు ఏర్పడ్డాయని, సమస్యల పరిష్కారానికి సివిల్ కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేదని, అయినప్పటికీ చాలా సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయన్నారు.
ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తూ భూ భారతి చట్టం తీసుకురావడం జరిగింది. సమస్యలు ఉంటే ఆర్డీఓ, కలెక్టర్ కు అప్పీల్ చేసుకునే రెండెంచెల అప్పీల్ వ్యవస్థ భూ భారతి చట్టంలో కల్పించడం చాలా కీలకమన్నారు. భూ భారతి చట్టంలోని ప్రతి అంశాన్ని ప్రజలందరూ అవగాహన చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి : ప్రభుత్వం ఏదైనా కొత్త చట్టం తీసుకువచ్చినపుడు అందులోని ప్రతి అంశాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంటుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు .
సమస్యలు వచ్చి న్యాయ వ్యవస్థకు వెళ్ళాక చట్టంలో ఉన్న అంశం నాకు తెలియదు అనిచెప్పడానికి వీలు లేదన్నారు. ఇంతకు ముందు ఉన్న ధరణి చట్టంలో ఉన్న సమస్యల పరిష్కారానికి మేధావులతో చర్చించి భూ భారతి చట్టం -2025 తీసుకురావడం జరిగిందన్నారు. ఏ చట్టం రూపొందించినా వాటి నిబంధనలు తీసుకురావడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టేదని కానీ భూ భారతి చట్టం ఏర్పాటు చేశాక నిబంధనలు కేవలం రెండు నెలల్లో రూపొందించడం గొప్ప విషయం అన్నారు. ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలని కోరారు.
అనంతరం భూ భారతి చట్టం గురించి అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం సైతం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, గోపాల్ పేట తహసిల్దార్ తిలక్ రెడ్డి, రేవల్లి తహసిల్దార్ లక్ష్మీ, కాంగ్రెస్ నాయకులు సత్యశీలా రెడ్డి, మండల అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.