calender_icon.png 23 July, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డున పడేస్తారా?

23-07-2025 01:21:17 AM

చిన్న చిన్న కారణాలకే ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ కార్మికులు

  1. అగమ్యగోచరంగా 1,200 మంది కార్మికుల భవిష్యత్ 
  2. ప్రభుత్వం అంగీకరిస్తున్నా ఎండీ అడ్డుకుంటున్నారని ఆరోపణలు
  3. తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోవాలంటూ కార్మికుల ఆందోళన 
  4. ఎండీ, ఎమ్మెల్యేలు, మంత్రులు.. చివరకు సీఎంను కలిసినా ఫలితం లేదని ఆవేదన 
  5. ఆర్టీసీ ‘200 కోట్ల సంబురాల’ నేపథ్యంలో మానవత్వం చూపాలని విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): బ్రీత్ అనలైజర్ టెస్టులంటే ఆర్టీసీ కార్మికులు హడలిపోతారు. సరిగా ముఖం కడుక్కోకపోయినా, నోట్లో కాస్త పాచి ఎక్కువున్నా కూడ తప్పుడు రీడింగ్ కారణంగా మద్యం తాగినట్లుగా నిర్ణయించి ఉద్యోగాల నుంచి తొలగించడం, టికెట్ ఇష్యూ మెషీన్ (టిమ్)లో పొరపాట్లకు బాధ్యులను చేస్తూ కొలువులను తీసే య్యడం, నెక్ట్స్ స్టాప్‌లో ఎక్కాల్సిన రిజర్వేషన్ ప్రయాణికుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసిన సందర్భంలో ప్రయాణికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తే ఉద్యోగాలు కోల్పోవడం, అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ల కారణంగా ఇంటికి పంపించడం..

వంటి కారణాలతో సుమారు 1,200 మంది ఆర్టీసీ కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోయినట్లు వాపోతున్నారు. ఉద్యోగాలు చేసుకునేందుకు అవ కాశం కల్పించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సహామంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరినీ కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు.

20 నెలల్లో 200కోట్ల మంది మహిళా ప్రయాణికులను మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా గమ్యస్థానాలకు చేర్చిన సందర్భంగా సంబురాలు చేసుకుంటున్న వేళ పేద కార్మికులను రోడ్డున పడేయకుండా తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకుంటున్నారు.

‘చిల్లర’ కారణాలు..

ఆర్టీసీలో ‘చిల్లర’ కారణాలతో అనేక మంది కండక్టర్లు ఉద్యోగాలు కోల్పోయారు. టికెట్ జారీ సమయంలో రూ.10 తేడా వచ్చినా కేసులు పెట్టారని కార్మికులు వాపోతున్నారు. మహాలక్ష్మి పథకం వచ్చాక మూడు రెట్లు ప్రయాణికులు పెరిగారని ఫలితంగా ఒక్కోసారి పొరపాటు టిమ్‌లో ఫ్రీ టికెట్ జారీ చేసిన సందర్భాల్లో చెకింగ్ అయి ఉద్యోగాలు కోల్పోయామని మరికొందరు చెబుతున్నారు.

ఇక బ్రీత్ అనలైజర్ టెస్టుల్లో 90 శాతానికి పైగా డ్రైవర్లు ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారు. విధుల్లోకి తిరిగి తీసుకోవాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించడం లేదని వాపోతున్నారు. ఆర్టీసీ ఆర్‌ఎం, ఈడీల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి వరకు వెళ్లి వేడుకు న్నారు. అయినా కూడా వారి సమస్య అలాగే ఉండిపోయింది.

అయితే కార్మికుల సమస్య పరిష్కరించేందుకు రవాణా శాఖ మంత్రి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయగా.. 496 కేసులకు సంబంధించి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోమని జాబితా ఇచ్చారని అయినా నేటికీ ఫలితం లేకుండా పోయిందని ఉద్యోగాలు పోయినవారు ఆవేదన చెందుతున్నారు. ఆర్‌ఎం, ఈడీ వద్ద అప్పీల్‌లో ఉన్న వారి కేసులను 30 రోజుల్లో పరిష్కరించమన్నా కూడా మార్పులేకుండా పోయిందని వాపోతున్నారు.

ఈడీ లెవల్‌లో కోల్పోయిన వారికి 60 రోజుల్లో తీసుకోమని చెప్పారని..కానీ నేటికీ ఎలాంటి ఫలితం రాలేదని చెబుతున్నారు. అయితే సుమారు 1,200 మంది ఉద్యోగాల నుంచి తొలగించగా.. అప్పీల్ మేళాలో 136మందికి జాబ్ ఇచ్చారని.. మిగతా వాళ్లకు కూడా ఇవ్వాలని కార్మి కులు డిమాండ్ చేస్తున్నారు. వీరంతా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. మంగళవారం కూడా ప్రజాభవన్‌కు వచ్చి అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. 

ప్రభుత్వం స్పందించాలి..

చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించిన తమపై ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ఉద్యోగంలోకి తిరిగి తీసుకోవాలి. కోర్టు పరిధిలో కేసు నడుస్తుండగానే నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఇప్పుడు కోర్టులో కేసును గెలిచాను. ఈ మేరకు జడ్జిమెంట్ కాపీ కూడా వచ్చిందని అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినా ఉద్యో గంలోకి తీసుకోలేదు. అయితే ఇదే అంశంపై కోర్టులో కేసు వేశాను. యాజమాన్యం కార్మికుల కష్టాలను గమనించి ఉద్యోగాల్లోకి తీసుకుని ఆదుకోవాలి.

 దాసరి రాంబాబు, ఉద్యోగం కోల్పోయిన ఆర్టీసీ కార్మికుడు

ఆర్టీసీ ఎండీకి క్షమాపణ చెప్తే ఉద్యోగం ఇస్తారంట..

చిన్న పిటీ కేసు కారణంగా నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులను కలిసి మా సమస్యను తెలిపాం. చివరకు ప్రభుత్వం స్పందించి ఓ కమిటీ వేసింది. 496 మందిని తిరిగి తీసుకోమని కమిటీ చెప్పినా ఎండీ సజ్జనార్ అందుకు సుముఖంగా లేరు. ఉద్యోగాలు కోల్పోయిన 200 మందిమి మంగళవారం ప్రజాభవన్ వెళ్లి మా సమస్య చెప్పుకుంటే..

ఆర్టీసీ ఎండీకి క్షమాపణ చెప్తే తిరిగి ఉద్యోగంలో జాయిన్ అవుతావంటూ ఓ అధికారి పేర్కొన్నారు. నేను ఏం తప్పు చేశానని క్షమాపణ చెప్పాలని ప్రశ్నిస్తే అక్కడి నుంచి పంపించేశారు. తిరిగి తీసుకోమని చెప్పిన 496 మంది జాబితాలో నేనే మొదటి స్థానంలో ఉన్నా. కార్మికులపై ఇంతటి కక్షసాధింపు ఎందుకో అర్థం కావడం లేదు. 

 దుగ్గు రాజేందర్, ఉద్యోగం కోల్పోయిన ఆర్టీసీ కార్మికుడు