27 March, 2026 | 3:21 AM

భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి

27-03-2026 01:21 AM

కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్

సూర్యాపేట, మార్చి 26 (విజయక్రాంతి): జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాదా బైనామ, భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని  విసీ హాల్ నందు జిల్లాలోని ఆర్డీవోలు, తహసిల్దార్ లతో పెండింగ్ సాదాభైనమా, భూభారతి, భూ సమస్యలపై వేబేక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కొనుగోలుదారు, అమ్మకందారు ఇద్దరి నుంచి అఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధనతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం  కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకునేలా జీవో 76ను జారీ చేసినట్లు తెలిపారు.సాదా బైనామా ద్వారా భూములు అమ్ముకునే సమయంలో అమ్మే వ్యక్తి రికార్డు నందు నమోదు కలిగి ఉండాలని, అదే విదంగా పట్టా భూములను మాత్రమే ప్రాసెస్ చేయాలని సూచించారు.

వీటితో పాటు భూమి మీద పొజిషన్ తో పాటు, 5ఎకరాల లోపు  భూములు కలిగివున్న వారికీ మాత్రమే పరిష్కరించాలన్నారు. నోటీస్ జారీ చేసి 30 రోజులు పూర్తి అయిన వాటిని పరిష్కరించాలని, క్షేత్ర స్థాయీలో పరిశీలన చేసి పంచనామా చేయాలన్నారు. చాలన్ కట్టే ముందు ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు సరిచేసుకోవాలని  ఆదేశించారు. సాదా బైనమా దరఖాస్తులకు పరిష్కారం తొందరగా పూర్తి చేసి అర్హులైన వారికి  13 (బీ) పట్టాలను జారీ చేయాలన్నారు.

భూభారతి పెండింగ్ దరఖాస్తులను 15 రోజుల్లో పరిష్కారం చూపాలని, అలాగే కోర్టు కేసులు, హైకోర్టులో నమోదైన కేసులకు విధిగా జవాబు ఇవ్వాలన్నారు. అదే విదంగా స్లాట్స్ బుకింగ్  క్యాన్సిల్ చేసుకున్న వారికి రీ పేమెంట్ అయ్యే విధంగా చర్యలు చేపట్టలని సంబంధిత తహశీల్దార్లను ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ కింద ఎలక్షన్ మ్యాపింగ్ ఎంట్రీ త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి సుదర్శన్ రెడ్డి, సూపర్డెంట్లు సాయిగౌడ్, శ్రీలత, సంతోష్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.