calender_icon.png 4 December, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిల్ట్ పేరుతో భూదందా

04-12-2025 01:23:37 AM

  1. ప్రజా ప్రయోజనాలకన్నా సీఎంకు సొంత ప్రయోజనాలే ముఖ్యం
  2. బడా వ్యాపారుల కోసమే జీవో నెం.27 జారీ
  3. ఎక్స్‌పర్ట్ కమిటీతో అధ్యయనం చేయించలేదు
  4. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 3(విజయక్రాంతి): హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హిల్ట్) పేరుతో సీఎం రేవంత్ రెడ్డి పెద్ద భూదందాకు తెరతీశారని, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పారిశ్రామిక వాడలను తరలించాలని, ఆ భూములను కమర్షియల్ అవసరాల కోసం వినియోగించుకునేందుకు మార్చుకునేలా అనుమతి ఇస్తూ జీవో నెం.27 తీసుకొచ్చారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

రేవంత్‌రెడ్డికి ప్రజల ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారని, బడా వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకే ఈ జీవో తీసుకొచ్చారని విమర్శించారు. ప్రజాప్రతినిధులతో, పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల తో, పరిశ్రమల యజమానులతో చర్చించకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడం చాలా దురదృష్టకరమన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని దాదాపు రూ.10 లక్షల కోట్ల రుణాలతో అప్పుల కుప్పగా మార్చారన్నారు.

ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, అందుకోసం భూములను అమ్ముకోవాలని ప్రయత్నిస్తోందన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీ భూములను కూడా అమ్మాలని ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు చీవాట్లు పెడితే తప్ప వెనక్కి తగ్గలేదని, ఇలాంటి పాలసీ తీసుకొచ్చే ముందు ఎక్స్‌పర్ట్ కమిటీతో అధ్యయనం చేయించాలి కానీ, అలాంటిదేమీ చేయలేదన్నారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడారు.

‘పాలసీ తీసుకొచ్చిన తర్వాత కమిటీ ఏర్పాటు చేసి వారంలోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. 2014 నుంచి అన్నీ తానై వ్యవహరిస్తూ అన్ని నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ మేధావిలాగే.. రేవంత్ రెడ్డి రూపంలో మరో కొత్త మేధావి తెలంగాణ ప్రజలకు దొరికారు’ అని మండిపడ్డారు.

రేవంత్‌రెడ్డి కూడా మేధావిలాగే ఎవ రినీ అడగకుండా ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ పాలసీ తీసుకొచ్చే ముందు లక్షలాది మంది కార్మికు ల బతుకులు ఏమైపోతాయని మీరు ఆలోచించారా?, దూరప్రాంతాలకు పరిశ్రమలు తరలిస్తే వారంతా ఎక్కడికి వెళ్లాలి?, వారి కుటుంబాలు ఏమైపోవాలి? అని ఆయన ప్రశ్నించారు. 

రైతులకు నై.. పారిశ్రామిక వేత్తలకు సై..

హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం 2013లో హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ రూపొందించిందని, దీంతో ప్రణాళికాబద్ధమైన అభివృద్ది ఏమోగానీ రైతుల పాలిట మాత్రం శాపంగా మారిందన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవకాశం లేని కన్జర్వేషన్ లాంటి జోన్ల కిందికి రైతుల భూములు రావడంతో వారు సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్లు రావట్లేదన్నారు.

తమ జోన్ మార్చాలని రైతులు ఏళ్లుగా మొరపెట్టుకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం, అడగకుండానే పారిశ్రామికవేత్తలకు మాత్రం కన్వర్ట్ చేసుకునే వీలు కల్పిస్తూ.. రైతులకు తీరని ద్రోహం చేస్తోందన్నారు. ఈ ప్రాంతాల్లో మల్టిప్లెక్స్ కాంప్లెక్స్‌లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.

ట్రాఫిక్ సమస్య కారణంగా బెంగళూరులో పరిశ్రమలు తరలిపోతున్నాయని, మరి హైదరా బాద్‌ను కూడా మరో బెంగళూరుగా మార్చాలని చూస్తున్నారా?, అసలు ట్రాఫిక్ సమస్య, డ్రైనేజీ సమస్య గురించి అధ్యయనం చేశా రా? అని ప్రశ్నించారు. ఈ పారిశ్రామికవాడల్లో భారీ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలంగాణ సమాజం అనుమానాలు వ్యక్తం చేస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. బడా వ్యాపారులకు లబ్ధి చేకూర్చే ఈ పాలసీని ఉపసం హరించుకోవాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ యాంటీ హిందూ స్టాండ్..

రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను అవమానించేలా అహంకారపూరితంగా మాట్లాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కిషన్‌రెడ్డి చెప్పారు. హిందువుల మనోభావాలను కించపరిచేవిధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని, ‘యాంటీ హిందువుల స్టాండ్ తీసుకోవడం కాంగ్రెస్‌కు ఎప్పుడూ అలవాటే అన్నారు. కాంగ్రెస్‌తో పాటు, ఇండి అలెయన్స్ కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీయడం పరిపాటిగా మారిందన్నారు.

హిందూ దేవుళ్ల గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలకు ఇతర మతాల గురించి మాట్లాడే దమ్ముందా?, కాంగ్రెస్ అంటేనే ముస్లింలు, ముస్లింలు అంటేనే కాంగ్రెస్ అంటూ బుజ్జగించేలా మాట్లాడుతారు.. అదే హిందువుల గురించి మాత్రం కించపరిచేలా మాట్లాడటం దారుణం’ అన్నారు.

గతంలో కేసీఆర్ కూడా హిందువులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, ఆ తర్వాత కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌కు ప్రజలు ఎలా బుద్ధిచెప్పారో గుర్తు చేసుకోవాలని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికు కూడా త్వరలోనే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే సమయం వస్తుందని, ఇప్పటికైనా సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని  డిమాండ్ చేశారు.