చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడే
హైదరాబాద్: వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడేనని తేల్చిన ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి రూ.30 లక్షల భారీ జరిమానా విధించారు. వేములవాడ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. రమేష్ భారతీయ పౌరసత్వాన్ని సవాలు చేస్తూ శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు.
అదే ఆందోళనతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కూడా ఆశ్రయించారు. ఈ సవాళ్లను కొనసాగించడంలో శ్రీనివాస్ చేసిన న్యాయపరమైన ఖర్చుల కోసం కోర్టు రూ.25 లక్షల పరిహారంగా పరిగణించింది. చెన్నమనేని రమేష్ పై కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పోటీ చేసిన విషయం తెలిసిందే. చెన్నమనేని రమేష్ అక్రమంగా గెలిచారని ఆది శ్రీనివాస్ పిటిషన్ వేశారు. మరో రూ. 5 లక్షలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని కోర్టు చెన్నమనేనికి ఆదేశించింది. చెన్నమనేని జర్మన్ పౌరుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచారని హైకోర్టు వెల్లడించింది. తప్పుడు పత్రాలతో 15 ఏళ్లుగా కోర్టును చెన్నమనేని తప్పుదోవ పట్టించారని జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిమానా విధించిన డబ్బును నెలరోజుల్లో చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.






