05-10-2025 06:32:21 PM
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలను నవంబర్ 22 కి ముందే నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఆదివారం తెలిపారు. 243 మంది సభ్యులు కలిగిన బీహార్ అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22 తో ముగియనున్నాయి. బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పూర్తయినందుకు సీఈసీ ఇవాళ సంతృప్తి వ్యక్తం చేశారు. 22 సంవత్సరాల తర్వాత ఓటర్ల జాబితాను శుద్ధి చేశారని పేర్కొన్నారు.
తమకు 243 నియోజకవర్గాలలో ఈఆర్ఓ (Electoral Registration Officer) ఉన్నారని, దీంతో ఎస్ఐఆర్ ద్వారానే అనర్హులను జాబితా నుంచి తొలగించామన్నారు. దీన్ని బీహార్ ఓటర్లు స్వాగతించారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పూర్తయినందుకు ఓటర్లను సీఈసీ ప్రశంసించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి తమ భాగస్వామ్యాన్ని నిర్ధారించుకోవాలని ఆయన అభ్యర్థించారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అనేక కొత్త కార్యక్రమాలు చేపడుతున్నామని, వీటిని తగిన సమయంలో దేశవ్యాప్తంగా పునరావృతం చేస్తామని ఆయన అన్నారు.
రాష్ట్ర పర్యటనను ముగించే ముందు పాట్నాలో విలేకరుల సమావేశంలో జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ... ఈ కార్యక్రమాలలో ఈపీఐసీ కార్డులు రిజిస్ట్రేషన్ చేసుకున్న 15 రోజుల్లోపు ఓటర్లకు అందేలా కొత్త ఎస్ఓపీ (ప్రామాణిక ఆపరేటింగ్ విధానం), పోలింగ్ బూత్‌లలో మొబైల్ డిపాజిట్ సౌకర్యం ఉన్నాయని వ్యాఖ్యానించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎన్ని దశల్లో నిర్వహించాలనేది పార్టీల సూచనలను విన్న తర్వాత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బీహార్‌లో చివరిసారిగా 2003లో ఓటర్ల జాబితా సవరణ జరిగింది. 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓటర్ల జాబితా సవరణ జరిగిందన్నారు.