14-04-2025 12:00:00 AM
బిరుదురాజు రామరాజు 16న శత జయంతి
ఆ రోజు ప్రొద్దస్తమా నం సృష్టి కార్య కలాపం నొసటి వ్రాతలు పూర్తి చేసి బరువెక్కిన గుండెతో నైరాశ్యాన్ని సూచించే ముఖంతో బ్రహ్మదేవుడు అంతఃపురంలోకి ప్రవేశించాడు. నాథుని చిన్నబోయిన ముఖం చూసి సరస్వతీదేవి గుండె నీరైంది. కుశలప్రశ్నలు వేసి “ప్రభూ! నిఖిల భువన సృష్టి కర్తల ముఖ కమలం ఏదో చింతాభారాన్ని సూచిస్తుంది. నావల్ల ఏమైనా అపచారం జరిగిందా?”
“ప్రియే! అలాంటిదేమీ జరుగలేదు కాని నా వ్రాతలో ఏదో తెలియకుండానే పొరపాటు జరిగిపోతోంది. ఎంతో శ్రద్ధతో జీవుల్ని సృష్టించి సత్యం, క్షమ, ధర్మం మొ దలైన సద్గుణాలు సమభాగాలుగా పంచిపెట్టినా మానవ లోకంలో అసంతృప్తి కలహాలు, రక్తపాతాలు, ద్రోహం, కుత్సితం రోజురోజు ప్రబలిపోతున్నాయి. ఆదర్శప్రాయంగా సృష్టించిన స్వాధ్యాయము విరిత ము పవిత్ర హోమానల ప్రదీప్తము అయి న వేదభూమిలో కూడా మితిమీరిన దౌర్జన్యము, కుట్రలు విప్లవాలు బయలు దేరు తున్నై. అన్నదమ్ముల్లోనే అంతఃకలహాలు.
ఈ దారుణ విప్లవేతిహాసానికి అంతులేనట్టుంది” అంటూ కాళ్ళు చేతులు కడుక్కొని, రెండు మెతుకులు నోట్లో వేసుకొని తల బరువుగా ఉందంటూ శయన గృహము చేరుకున్నాడు. కాసేపు ప్రక్కమీద అటూఇటూ దొర్లాడు. అదే చింతలో కండ్లు మూసుకున్నాడు. కాస్త కునుకు పట్టిందో లేదో..తానొక్కడే సత్యలోకం వీధుల్లో పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. వీధుల్లో ఏదో కలకలం ఆరంభమైంది. గుంపులు గుంపులుగా వీధుల్లో గాలవ శాండిల్య పిప్పల గార్గ్య వసిష్ఠ భరధ్వాజ మార్కండేయాది మునిగణమంతా జయజయ నినాదాల్తో డెమాన్‌స్ట్రేషన్ జరుపుతున్నారు.
కాళ్ళు చేతులు కడుక్కొని, రెండు మెతుకులు నోట్లో వేసుకొని తల బరువుగా ఉందంటూ శయన గృహము చేరుకున్నాడు. కాసేపు ప్రక్కమీద అటూఇటూ దొర్లాడు. అదే చింతలో కండ్లు మూసు కున్నాడు. కాస్త కునుకు పట్టిందో లేదో.. తానొక్కడే సత్యలోకం వీధుల్లో పిచ్చి వాడిలా తిరుగుతున్నాడు. వీధుల్లో ఏదో కలకలం ఆరంభమైంది. గుంపులు గుంపులుగా వీధుల్లో గాలవ శాండిల్య పిప్పల గార్గ్య వసిష్ఠ భరధ్వాజ మార్కండేయాది మునిగణమంతా జయజయ నినాదాల్తో డెమాన్‌స్ట్రేషన్ జరుపుతున్నారు.
అరరే! ఇదేం విపరీతం వీరేనా, కామక్రోధాల్ని విడిచి యుగయుగాలు పంచాగ్ని మధ్యమున మహోగ్ర తపం చేసి ముముక్షు వులైన మునిముఖ్యులు! అబ్బో.. వీళ్ళ గడ్డాలు విభూతి పుండ్రాలు మాయమైనవే! కాషాయ వస్త్రాలు కంథా కమండ లాలు యోగదండాలు పారేసి పాకార్డ్స్ పట్టుకున్నారేం! వీటిపై ఎఱ్ఱ సిరాతో ఏమో వ్రాశారే, ఏంటి, విప్లవం వర్ధిల్లాలి! నిరంకుశాధికారం నశించాలి! ప్రజాస్వామ్యం కావాలి! ఇంద్రుణ్ణి గద్దె దించాల్సిందే! బ్రహ్మను పడదొయ్యాల్సిందే! అమ్మో.. కొంప మునిగిందే!!!
ఇదేం రోగం వీళ్ళకి? ఉండుండి ఇట్లా తయారైనారేం? మోకాళ్ళ వరకు లాల్చీలు, ఖద్దరు టోపీలు, కళ్ళకద్దాలు, కాళ్ళకి చెప్పు లు.. అయ్యో అయ్యో సత్యలోకమంతా భ్రష్టమైందే? ముక్కు పట్టుకొని తపస్సు చేసుకొనే మునిముండా కొడుకులకీ విపరీత బుద్ధులేంటి? వీరినోట్లో ఏమో తెల్లగా ఉన్నాయేం? అరరే.. సిగరెట్లు కాలుస్తున్నా రే! వీళ్ళ నిత్యాగ్నిహోత్ర కర్మలు కాలిపోను! మేకల మోస్తరేమో చప్పరిస్తున్నారే? ఉఁహూఁ! తమ్మలపాకులు!!! పవనపర్ణాం బు భక్షులై ఇనుపకచ్చడా ల్గట్టిన మునిమ్రుచ్చులు!!! ఏదో ప్రళయ మొచ్చేట్టుంది. ఏమో నా అంతఃపురం వైపు పరుగెడుతున్నారే? తగలబెట్టరు కదా! ఇక్కడుంటే చంపేస్తారట్టుంది....
అదిగో! వీడెవడు? మా అబ్బాయున్నట్టుందే! బ్రహ్మ మానసపుత్రుడు, అస్ఖలిత బ్రహ్మచారి, ఓరి వీడి దుంపతెగా, శిగ గొరిగించి క్రాపింగెట్టుకున్నాడే! నెత్తిమీద ఇదేం టి? అమ్మయ్యో ఫెల్టు! సరస సంగీతప్రియుడు విష్ణుపాదార విందనం సేవనాప రుడు భక్తిరస పరిప్లుత సుస్నిగ్ధామృత చ్ఛాయా విలవిత ముఖారవిందుడు, వీడికీ బుసుకోటెందుకు? ఆఁ! కాళ్ళకు క్రెవ్‌షూ! స్వర్లోకాలు పులకించెట్టు నిక్వాణం చేసే మహతి (నారదుని వీణకు పేరులెండి) ఎక్కడో పారేసి ద్వారం వారివలె వయోలి న్ పట్టుకున్నాడేం! చేతిలో ఏదో గ్రంథముందే స్వరార్ణవం కాదు గదా! అమ్మ య్యో! రేరాణి అభిసారిక సంచికలు వీడికెక్కడ లభించాయి. ఏలాంటి వాళ్లెట్లా మారి పొయ్యారేం!....
మఱి వీళ్ళెవరు? నిలింప భామినులున్నట్టుందే? త్రిలోక సౌందర్యమూర్తులు వీళ్ళకే పుట్టింది? ఆఁ ఆఁ! ఆడవాళ్ళకి సమాన హక్కులా? శాసనసభలో సీట్లా? సివిల్ సర్వీసులో రిజర్వేషనా? ఇన్నాళ్ళు మాత్రం మీకేం లోటుండేది? వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. సుదీర్ఘ నీలకుంతలాలు కత్తిరించి క్రాపులు తీశారే! హరి చందన కస్తూరినా మకరికా పత్రాలు విడిచి క్యూటికూర పౌడరు వేశా రూ! మఱి అధరాలేమో పూర్వం కంటే స్నిగ్ధ సుందరారుణ రాగరంజితాలుగా ఉన్నాయే! అబ్బే పొరపాటు లిప్‌స్టిక్ పేంటింగు లు. అయ్మయ్యో! చిన్న చిన్న రిస్టువాచీలు పెట్టారు! మరకత మణిమడు భర్మకటకాలు బాగాలేవేఁ? విలాస లాలస కురంగ లోచనాలమీద గాజుపెంకులు తగిలించారూ! సంతానవల్లన తులితకోమలా రుణ పాదపద్మాలకీ చీనా బూట్లు తొడిగి వీధులెంట తిరుగుతున్నారేం! ఎక్కడో ఇంట్లో హాయిగా కూర్చోక మీకీ పోగాల మెందుకు దాపురించింది?...
అరే ! ఇదేంటి? నా కొలువు కూటానికి ఏదో బోర్డు తగిలించారే? న్యాయస్థాన మా? కోర్టులూ ప్లీడర్లూ ఇక్కడా తయారైనారూ! లోపల ఏం గూడుపుఠాణి జరుగు తోందో కాస్త చూద్దాం. ఈయనెవరు వైకుంఠపతి! చక్రాయుధుడు! అయ్యో దశదిశల దివ్యరోచులు వెదజల్లే నీ పీతాంబర మేమైంది స్వామీ? నఖశిఖ పర్యంతం నల్లజబ్బా తొడిగావు? ఓహో న్యాయాధీశ పద వలంకరించావు బాబూ! ఏయెండ కాగొడుగు పడ్తావు కదూ! ఈ అప్పర్చు నిజం నీకూ అబ్బింది! కౌస్తుభ మణిమాయమైన పోయి మెడకు తెల్లపేలికలు వ్రేలాడుతున్నాయేం? పద్మాక్షుడవు కదూ! బ్లాకు గాగుల్సు తగిలించావూ! అయ్మయ్యో! చర్చిల్ మార్కు సిగారు నీ కెక్కడ లభించింది.
ప్రభూ! శంఖుచక్రాలు విడిచి ఇనుపకొయ్యలు పట్టుకున్నావేం? హార కేయూర కటక కుండలాల మోజు తీరిపోయిందీ! సరేగాని ఏం తీర్పు చేస్తున్నావు? ఈమెవరు? పరమ పతివ్రత శ్రీరామచం ద్ర పాదరేణు పునీత అహల్య ఉన్నట్టుందే! ఓహో ఈయన తపోనాఢ్యుడు గౌతముడు కాబోలు! మరీ ప్లీడరెవరు? స్వర్గాధిపతి మహేంద్రుడు! అరే అహల్య గౌతముడికి విడాకులిస్తున్నట్టుందే! ఆహా! ఏమి తీర్పు! ఆర్తత్రాణ పరాయణుడవు కదూ! పాహి అన్నంత మాత్రాన ద్రౌపదికి అక్షయ వలువలిచ్చావు కదూ! బాగుంది! నిగ్రహా నుగ్రహ సంపన్నుండైన గౌతముడు చవట మోస్తరుగా చేతులు నలుస్తున్నాడేం? ఇదేం రహస్యం అహల్యను ఒంటరిగా పిలిచి విష్ణుమూర్తి ఏమో చెయ్యి చాస్తున్నాడే! అమ్మయ్యో లంచం! లంచం! గౌతముని పని పూర్తయింది. ఈ ఊర్ధ్వలోకాలన్ని నాశనమయి పోయేట్టుంది....
వీళ్ళెవరు? ఓహూ మునికుమారులు! యువక నివలింపులు! బృహస్పతి శిష్యు లు పాఠాలు వల్లించకుండా ఇక్కడెందుకో గుమికూడారే? సమ్మె చేస్తున్నారూ! ఏం టీ? పాఠాలు వల్లించకున్నా పాఠశాలకు పోకున్నా గురువు లూర్కుండాల్సిందే! ఎకాడమిక్ ఫ్రీడమ్ కావాలి! కన్సెషన్స్ కావాలి! పరీక్షలు వద్దూ! ప్రస్తుత విద్యావిధానం మారాలి! జందెప్పోనలు తెంపేశా రూ! శిఖలు గొరిగించి క్రాఫులు తీశారూ! రత్నఖచిత దివ్యకిరీటాలు పారేసి చిప్పలు బోర్లించారూ!
పట్టుపుట్టాలు విడచి కాళ్ళెంబడి వేళ్ళాడే సంచుల్లో చొక్కాలు తోశారూ! పాఠాలు చదువలేని పెద్దమ్మలు మరచేతులో ఏవో ఉద్గ్రంథాలు పట్టుకున్నారేం! వాట్ ఈజ్ డెమోక్రసీ! కుఱ్ఱకుంకల కీ రాజకీయాలెందుకు? ఎవరెక్కడ పోతేం! హాయిగా కడుపులో చల్ల కదలకుండా చదువుకోక చిన్నప్పటి నుంచే ఈ పోకిరి వేషాలెందుకు? ఇదంతా ఏంటో సురగురుణ్ణి విచారిద్దాం!!!
ఓహో! ఈయన కచయోగి ఉన్నట్లుందే! ప్రేమమూర్తి! సురాసుర గురుసన్నిధానాన మహాదీక్షతో సమస్త విద్యల నభ్యసించిన విజ్ఞానమూర్తి! మరి ఈ సాయంత్రం ఎటో తయారైనాడేం! అయ్యో నాయనా! నీకు కూడ ఈ రోగం పట్టిందీ? బుష్‌కోటు బ్లాక్ గాగుల్సు చిన్నగడ్డం సోషలిస్టులా తయారైనావేం? ప్రక్క ఉన్న ఈ సౌందర్యమూర్తి ఎవరు చెప్మా? ఓహో శుక్రాచార్యుల పుత్రిక పరమ పతివ్రత దేవయాని! కచయోగీంద్ర మానసాంతర ప్రేమ మాధురీ మకరంద స్రవంతికా వీచీడోలికాందోళిత ప్రేమమూర్తి! అయ్యయ్యో! రెండు జడలు వేసిందే! ద్వివేణి! ఏమి వేషం? ఎగుబుజా ల జాకెట్టు మోకాళ్ళ వరకు గౌను హైహీల్డు షూ చేతిలో సంచి! పితృమంది రాంగణోద్యాన వనంలో పుష్పాపచయానికై తాల్చి న మంజూషిక ఈ అవతారం దాల్చిందా తల్లీ! భేష్! బాగుంది. వీళ్ళెక్కడికి వెళ్తారో చూద్దాం. అరే! ఇదేం భవనం? ఓహో రంభా సౌధాంగణంలో చిత్రపటాలు వ్రేలాడుతున్నాయే! ఇది సినిమా థియేటరున్నట్టుంది.
ఏమో వ్రాసుందే? ‘ప్యార్ కీ జీత్’ సర్వ విద్యా పారంగతుడైన కచుడు విజిలింగు చేస్తూ ఏమో పాడుతున్నాడే! ఏంటి! ‘గాలిలో నా బ్రతుకు తేలిపోయిన వోయి’. ఆఁ నీ బ్రతుకు గాలిలో తేలిపోయేలాగ ఉంది! మంచి పనైంది! నాయనమ్మ కు టికెట్టు దొరకనట్టుంది! ఆఁ ఆఁ రెండింతలు చెల్లించి బ్లాక్ మార్కెట్ చేసి బాక్స్‌లో కెళ్ళారే ! అయ్యో! సమస్త లోకాలకెట్టి దుర్గతి పట్టింది? ఈ దావానల భీషణ జ్వాలలతో లోకాలన్ని భస్మమైపోతాయి కాబోలు!!! అదిగో! అక్కడేదో సభ జరుగుతుందే! ఏంటీ నవ్యకవితా సదనమా! ఎవరో మహానుభావుడు నిర్గళంగా ఉపన్యసిస్తున్నాడే! అరరే వేదవిభాగకర్త! పంచమ వేదకర్త! సాక్షాత్ వ్యాస భగవానుడు.
మఱి ఏమా ధారావాహికంగా చెబుతున్నాడు! వాల్మీక్యాది మహాకవులు పాణిన్యాది వైయాకరణులు బారులుదీర్చి కూర్చొని వింటున్నారే! ఇక్కడైనా కాస్త మనశ్శాంతి లభిస్తుంది. మహానుభావులు తమ అమర కవితాగానంతో రాళ్లు కరిగించి మ్రోళ్ళు పుష్పింపజేసి నా సృష్టికి ప్రతి సృష్టి చేసి తాము ధన్యులై ఇతరుల సైతం ధన్యుల చేసిన కవి వృషభులు! పరమ భాగవతోత్తముడైన బాదరాయణునికీ వేషమేంటి? సిల్కులాల్చి ఇస్త్రీ మడతల జరీ కండువా తెల్లని ధోవతీ కాళ్ళకు సాందిల్సు ముక్కు క్రింద పిడుదుల్లా మీసాలు! ఏం ఉపన్యసిస్తున్నావు మహానుభావ! ఆఁ ఆఁ భావ కవిత్వమా! ప్రజాసాహిత్యం కావాలి! ఛం దో ముంధనాలు పనికిరావు! యతి ప్రాస నియమాలు వద్దూ! ఓహో దాదాయిజం సర్రియలిజం ఈ ఇజం రోగం నీకు కూడా పట్టిందీ! సరిసరి బాగుంది....
ఇదేంటి అభ్యుదయ నాట్యకళా సమితియా! లోపలేముందో కాస్తా చూద్దాం. భరత నాట్యకళా ప్రవీణులున్నంటుందే! అదిగో పినాకపాణి! సంధ్యా నటుడు! వీళ్ళంతా ప్రమధులున్నట్టుందే! భసి ద్ధూళితుడవై కుందర మందార శంఖచంద్ర హారనీహార డిండీరపటీం ముక్తాహార హీర ఘనసార కాంతిపూర సితచ్చటా నటత్తటిన్ని భగాత్రముతో అర్ధనిమీలిత నేత్ర ముల తోడి ప్రమధగణము నృత్యము సేయ కపాలమాలికల దాల్చి శ్మశాన వాటికల సంధ్యానాట్య మొనర్చు నీ కీ ఫుల్ సూటెక్కడిది దేవా? గజచర్మం పారేశావూ అయ్యో! నీ త్రినేత్రమేమైంది? డమరుక నినాదం వినరాదే? ఓహో ప్యానోమ్రోగుతుందే! ఇదేం విపరీత నాట్యం స్వామీ! ‘లాల్లల్లా లాల్ల లాల్లా’ ఇంగ్లీషు డాన్సెసు నేర్చుకున్నావూ! ఛీ ఛీ బ్రహ్మాస్త్రం ప్రయోగించి స్వర్ణోకాలన్నీ మానవలోకం కంటే ముందే భస్మీపటలం చేసి లోకాలన్నీ కలు ష రహితం చేసేస్తా! ఇక ఒక్క క్షణం కూడా వీళ్ళ మొగాలు చూడకూడదు ఇంటికి వెళ్దాం.
ఇంతకు అక్కడేం పుట్టి మునిగిందో.... వాణీ! వాణీ! గీర్వాణీ! రమ్యపుస్తక పాణీ! ఒసేవ్! మాట్లాడవేం! ఎక్కడ చచ్చావే? ఇక్కడ కూర్చుండి పలకవేం మొద్దులాగా! హరహరా! నీకీ వేషమేంటే? ఈ గాలి నీకూ సోకిందీ! అయ్యో అయ్యో చతుర్భుజవు అక్షమాల పుస్తకం కచ్చని ఎక్కడ తగలేశావు? బాడ్మింటన్ రాకెట్ పట్టుకున్నావేం. అయ్యో అయ్యో శారద నీరడేం దు ఘనసార పటీర మరాళ మల్లికా! ఛీ ఛీ! అబ్బా! ఇస్ అంటూ ప్రక్క తిరిగేసరికి
“ఏమండీ అప్పటి నుండి పలవరిస్తున్నారు?” అని ప్రశ్నిస్తే కండ్లు నలుపుతూ ఛీ ఛీ పీడకలంటూ దిగ్గడు లేచాడు పాపం.
ప్రచురణ కాలం: ఏప్రిల్ 1950, ‘శోభ’ విద్యార్థి పత్రిక
‘వరంగల్లు జిల్లా కథా సర్వస్వం’ నుంచి.. కర్త: సంగిశెట్టి శ్రీనివాస్‌కు సౌజన్యంతో..