30-07-2025 09:12:25 AM
నాగర్ కర్నూల్(విజయక్రాంతి): సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులంతా అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కానీ తెలకపల్లి మండల పీహెచ్సీ కేంద్రంలో సిబ్బంది అంతా ఒకేరోజు డుమ్మా కొట్టడంతో మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్(District Additional Collector Amarender) తనిఖీ చేసిన సమయంలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. తనిఖీ చేసిన సమయంలో వైద్యాధికారితో పాటు స్టాఫ్ నర్స్ ఇతర సిబ్బంది ఎవరూ రోగులకు అందుబాటులో లేకపోవడంతో అగ్రహానికి లోనయ్యారు. ఆ సమయంలో ఆయుషు డాక్టర్ భానుచందర్ మరో ఏఎన్ఎం మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో జిల్లా వైద్యాధికారిని స్వరాజ్యలక్ష్మికి ఫోన్ లో మాట్లాడి ఆసుపత్రికి డుమ్మా కొట్టిన వైద్యురాలు, సిబ్బందికి మెమో జారీ చేయాలని ఆదేశించారు. కానీ పర్యవేక్షణ చేయాల్సిన అధికారులే ఫోన్ లో లీవ్ అడిగారంటూ సదరు డాక్టర్, సిబ్బందిని వెనకేసుకు రావడం విశేషం. దీంతో ఏమీ చేయలేక వెనుదిరిగి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. తాడూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరో అదనపు కలెక్టర్ దేవ సహాయం ఆకస్మికంగా సందర్శించారు.