calender_icon.png 11 May, 2025 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మధురభక్తి’మయ కృతికర్తసారంగు తమ్మయ్య

14-04-2025 12:00:00 AM

“జాతుల వార్తల నుపమల

రీతుల బదబంధముల ధరిత్రీతల వి

ఖ్యాతిగ గృతులొనరించు పు

రాతన నూతన కవీశ్వరావళి గొలుతున్‌”

అంటూ పూర్వకవులను, నవీన కవులను స్మరిస్తూ సుకవులను కీర్తించిన కవి సారంగు తమ్మయ్య. ఈ స్తుతి లో ఉత్తమ కవిత్వాన్ని గురించిన ప్రసక్తి కూడా చెప్పాడు కవి. జాతి వార్తా చమత్కారాలు, సమర్థమైన ఉపమాద్యలంకారాలు, భావ పటిష్ఠతగల పదబంధాలు ఉన్నవే ఉత్తమ కృతులని చెప్పి, అట్లాంటి ఉత్తమ కృతికర్తలకు వందనం చేసే ప్రయత్నం చేశాడు సారంగు తమ్మయ్య.

ఈ కవిపై పద్యంలో పేర్కొన్న ఉత్తమ లక్షణాలన్నీ ఆయన రచించిన నాలుగు ఆశ్వాసాల కావ్యం ‘వైజయం తీ విలాసం’లో పుష్కలంగా ఉన్నాయి. ఈ నాలుగాశ్వాసాల్లోనూ పొందుపరిచి ఉన్న 568 గద్యపద్యాల్లో కవి ప్రతిభను కనబరిచే గొప్పగొప్ప విశేషాలు సాక్షాత్కరిస్తుంటాయి. దానివల్ల ఇది హృదయంగమమైన చక్కని తెలుగు ప్రబంధాలలో ఒకటిగా పేరు తెచ్చుకున్నది. ఇందులో ఒక రాజు చరిత్రగాని, ఒక తపస్వియైన ఋషీశ్వరుని చరిత్రగాని, ఒక మహావీర పురుషుని చరిత్రగాని, మరే విశేషమైన వృత్తాంతం గాని లేవు. కేవలం ఒక సామాన్య మానవుని వృత్తాంతమే చోటు చేసుకుంది. ఆయన అకుంఠిత భగవద్భక్తుడై స్వామి అనుగ్రహాన్ని పొందాడు. స్వామి మెడలో ‘వైజయంతీ మాల’గా స్వామిని చేరే ఒక అతిసామాన్య విప్రుని కథ ఈ ‘వైజయంతీ విలాస’ కావ్యం.

మహాభక్తుని కథగా ‘వైజయంతీ విలాసం’

సారంగు తమ్మయ్య ఈ కావ్యానికి ‘వైజయంతీ విలాసం’ అని నామకరణం చేయడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఇది ‘విప్రనారాయణుడు’ అనే రంగనాథ స్వామి భక్తుని కథ. ఈ కథను కావ్యంగా రచించిన చదలవాడ మల్లన ‘విప్రనారాయణ చరిత్ర’గా కావ్యనామా న్ని నిర్ధారించుకున్నాడు. తంజావూ రు పాలకుడైన విజయ రాఘవ నాయకుడు ‘విప్రనారాయణ చరిత్ర’మనే యక్షగానాన్ని రచించాడు. అదే విధంగా తాళ్లపాక చిన్నన్న పన్నిద్దరాళ్వారుల చరిత్రలను ద్విపద కావ్యంగా రచించాడు. అదే ‘పరమయోగి విలాసము’. ఈ కావ్యంలోని 4వ ఆశ్వాసంలో విప్రనా రాయణుని కథ పొందుపరచి ఉంది. తిమ్మ భూపాలుడు కూడా 1564 ప్రాంతంలో ‘విప్రనారాయణ చరిత్రము’ రచించినట్లు కొందరు సాహిత్య చరిత్రకారులు పేర్కొన్నారు.

విప్రనారాయణుడు పరమ విష్ణుభక్తుడు. తన అకుంఠిత భక్తితో స్వామి అనుగ్రహాన్ని పొందాడు. ఆయన కం ఠసీమలో వైజయంతి మాలగా స్వామి సాయుజ్యాన్ని పొందిన మహనీయుడు. అందుకే, సారంగు తమ్మయ్య ఈ కావ్యానికి విప్రనారాయణ చరిత్రమనే నామకరణం చేయకుండా ‘వైజయంతీ విలాసం’ అన్న పేరు పెట్టాడని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ఈ విప్రనారాయణుడు పన్నిద్దరాళ్వారులలో ఒకరుగా ‘తొండరడి ప్పొడి యాళ్వారు’డనే పేరుతో ప్రసిద్ధుడు. పరమ నిష్ఠా గరిష్ఠుడు. నిత్యం స్వామి సేవకే అంకితమైన సజ్జనుడు. నిత్యం స్వామిని మాలలతో అలంకరించడానికి ప్రత్యేకంగా ఒక పూలతోటనే ఏర్పరచుకొన్నాడు. అక్కడ్నించి పూలు సేకరించి తానే మాలలు గ్రుచ్చి స్వామివారికి సమర్పించుకునేవాడు. 

విప్రనారాయణుని జీవితంలోకి..

చెలికత్తెతో పందెం కాచి, ‘ఈయనను శృంగార పురుషుణ్ణి చేస్తానని’ పంతం పట్టిన దేవదేవి విప్రనారాయణుని జీవితంలోకి ప్రవేశించిన కథయే ఈ కావ్యం.

‘తొండరడిప్పొడి’ అంటే ‘భకాంఘ్రిరేణువు’ అనే భావం కనుక ఈ విప్రనారాయణుడు భగవంతుని పట్ల ఎంత గౌర వ ప్రపత్తులను ప్రదర్శిస్తాడో భగవద్భక్తులపట్ల కూడా అంతే భక్తి ప్రపత్తులను కలిగి ప్రవర్తిస్తాడు. ఈయన ఐదవ నుంచి ఏడవ శతాబ్ది మధ్య కాలం వాడని కొందరు, ఆరో శతాబ్దం వాడని మరికొందరు ఐతిహాసికులు పేర్కొన్నారు. ఈ మహాభక్తుని వృత్తాంతం సంస్కృతంలోని ‘దివ్యసూరి చరితము’లోను, విఖ్యాతి గడించిన ‘ప్రపన్నామృత’ గ్రంథంలోను కనిపిస్తుంది. తెలుగులో వెలువడ్డ ఈ రచనలకు ఈ గ్రంథాలే మూలములని సాహిత్య చరిత్రకారులు పేర్కొన్నారు. 

సారంగు తమ్మయ్య వైష్ణవ మతానుయాయి. 1560 ప్రాంతంలో 84 దుర్గాల తో గోల్కొండను పాలిస్తున్న మహమ్మదు కులీకుతుబ్ షాకు సన్నిహితుడు. నాటి గోల్కొండ నగరానికి కరణం కూడా సారంగు తమ్మయ్యయే. వారి సాన్నిహిత్యాన్ని తెలిపే

“ఇనసమ తేజులౌ నృపులనెల్ల మహమ్మదు 

శాహి మేలనీ

యెనుబది నాల్గు దుర్గముల నేలిన యేలిక 

గోలుకొండ ద

ద్ఘన నగరస్థలిన్ గరణికం బొనరించెడు 

దమ్మమంత్రి యా

జనపతి రమ్ము పొమ్మన బ్రజల్ జయవెట్ట 

గృహస్థు తానన్‌”

అన్న పద్యాన్నిబట్టి  సుల్తానుతో తన సాన్నిహిత్యాన్ని తెలిపే యత్నం కనిపిస్తుంది. 

శ్రీరామునికే అంకితం

ఏలికకు అంత దగ్గరి వాడైనా కావ్యం మాత్రం ఆయనకు అంకితం ఇవ్వలేదు. బహుశా నరాంకితం చేయడం తమ్మయ్యకు ఇష్టం లేని కారణంగా తన కృతిని శ్రీరామాంకితం చేశాడు. ఆయనకు పూర్వ రచనల్లోను, సమకాలీన రచనల్లోను ప్రధాన కథ సమానమే, అయి నా రుచి భేదాన్ని అనుసరించి కొన్నికొన్ని భేదాలు ఆయా కవుల ప్రతిభలనుబట్టి రచనల్లో చోటు చేసుకున్నాయి. కొన్నికొన్ని మార్పులు కూడా సంభవమైనా యి. ఆ మార్పుల్లో దేనికదే సముచితం అనిపిస్తుంది.

సమకాలీన జీవితాన్ని అత్యంత సమర్థంగా చిత్రించి కావ్యాన్ని గౌరవప్రదంగా మలచారు తమ్మయ్య. ఆయన తన ‘వైజయంతీ విలాసం’ కావ్యంలో ఇష్ట దేవతాస్తుతి, షష్ఠ్యంతాలు, కృతికర్త వంశాభి వర్ణనలు కూడా చోటు చేసుకున్నాయి. తమ వంశ మూల పురుషుడు సారంగధరుడని 

“శ్రీరంగ హిమవదంతర

భూరంగ త్కీర్తి యగుచు బొగడత కెక్కిన్

సారంగధరుడు, నిర్జిత

సారంగధరుండు కీర్తి సర్వజ్ఞుడిలన్‌”

“సారంగధరుడు వెలయగ

సారంగుని వారటంచు సచివాగ్రణులై

పేరుం బెంపును గాంచి రు

దారత నయ్యభవులనగ దద్వంశభవుల్‌”

అన్న పద్యాలనుబట్టి తెలుస్తున్నది. ఆ కారణంగానే వీరిని ‘సారంగు’నివారని వ్యవహరించినట్లు కూడా చెప్పుకున్నాడు. 

శ్రీరంగపుర వర్ణనతో ప్రారంభం

ఈ విషయానంతరం కావ్యం శ్రీరంగపుర వర్ణనతో ప్రారంభమైంది. మందగుడి కావేరీ నదీ తీరంలో ఉండే ఒక అగ్రహారం. నారాయణుడనే ఒక వైష్ణవ బ్రాహ్మణుడు భార్య అయిన లక్ష్మీదేవితో కలిసి ఆ అగ్రహారంలో నివసిస్తూ ఉండేవాడు. సంతాన హీనులై ఉన్న ఆ ఇంటి కి ఒకరోజు ఒక సన్యాసి మాధుకరానికి వచ్చాడు. అప్పు డు ఆయన, “తాను సంతానం లేని వారి ఇంట భిక్ష స్వీకరించనని” చెప్తాడు. దానికామె విచారించి, “ఇది విష్ణుప్ర సాద భాగమని దయచేసి స్వీకరించమని” అంటుంది.

దానికాయన కరుణించి భిక్ష తీసుకొని వెళ్లిపోతాడు. తర్వాత ఇంటికి వచ్చిన భర్తతో ఆ ఇల్లాలు ఈ విషయం చెప్పి, బాధ పడుతుంది. భర్త ఆమెను ఓదార్చి నిద్రించాడు. ఆ రాత్రి శ్రీమహావిష్ణువు నలుపు తెలుపు రంగు ల పూలతో గ్రుచ్చిన ఒక మాలను ఆ ఇల్లాలికి ఇచ్చాడు. ఆ మాలయే స్వామి కంఠాన్ని నిత్యం అలంకరించుకునే వైజయంతి మాల. 

ఆ వర ప్రభావం వల్లే వారికి పుత్ర సంతానం కలిగింది. విప్రనారాయణుడుగా పెరిగి పెద్దవాడైన ఆ బాలుడు గొప్ప వేదాదిశాస్త్రాలు అధ్యయనం చేశాడు. పండితులు, వైష్ణవ స్వాములపట్ల అకుంఠిత గౌరవాదరాలు కలిగిన వాడై మెలగుతుంటాడు. నిరంతరం స్వామికి మాలా  సమర్పణ కైంకర్యం చేసేవాడు. ఆ మాల కోసం కొన్నాళ్లు పూలను సేకరించేవాడు. 

ఆ తరువాత

“పరుల తోటల విరుల చే నరులనెంత

పెంపుగా స్వామికే సమర్పించుచున్న

దీనిచే గూలిమాత్రంబె కాని పూర్ణ

ఫలము రాదని యొక్క యుపాయమెంచి”

తానే కావేరీ తీరంలో కొంత భూమిని కొంటాడు. 

సాక్షాత్తు నారాయణుని సాక్ష్యం

ఆ మకుటద్వీపంలో వన్నెవన్నెల పలు పుష్పాల కోసం పూలమొక్కలను పెంచాడు. రోజూ తాను పెంచుకున్న పూలతోటలోని పూలతోనే మాలను గ్రుచ్చి స్వా మికి సమర్పించుకునే వాడు. అమాయక పండితుడైన ఈ భక్తుని జీవితంలోకి దేవదేవి ప్రవేశించడం, అతనిలోని బలహీనతవల్ల ఆమెకు విప్రనారాయణుడు దాసుడు కావడం, చివరకు ఆమె ఇంటి వరకు చేరడం, స్వామివారే ఆయన శిష్యుని రూపంలో వెళ్లి ఆలయంలోని వెండిగిన్నెను వేశ్యమాతకు ఇవ్వడం, తర్వాత విప్రనారాయణుపై దొంగతనం నేరం మోపడం, చివరకు రాజు విప్రనారాయణుని శిక్షించే సందర్భంలో సాక్షాత్తూ ఆ నారాయణుడే ఆలయపు జియ్యర్‌కు తానే ఆ వస్తువును దేవదేవి ఇంటికి చేర్చానని, “లీలా వినోదార్థము నేనే వీరిరువురిని జత గూర్చితినని, విప్ర నారాయణుడు నామాలికాంశ సంభూతుడని, దేవదేవి అప్సరోంగన” అని తెలుపుతాడు.  

ఆ విప్రనారాయణుని కంఠహారంగా ఐక్యం చేసుకోవడాన్ని అందరూ ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపడతారు. స్వామి అతనిని అనుగ్రహించిన విధానానికి విప్రనారాయణుని భక్తికి మెచ్చి తరించారు. ఆ దివ్య సందర్భంలో విప్రనారాయణుడు తమిళంలో చేసిన స్తోత్రమెన ‘తిరుమాలై’లో ఈ చరిత్ర 23 నుంచి 45 వరకున్న  శ్లోకాల్లో చెప్పడం జరింది. ఇప్పటికీ వైష్ణవాలయాల్లో గర్భగుడి ద్వారాలు తెరవక పూర్వమే ఈయన రచించిన ‘తిరుప్పళ్లి యెళుచ్చు’ అనే సుప్రభాత గీతికలను ఆలపిస్తూ ఉంటారు. ఇంతటి భక్తుడు, పండితుడు, కవి అయిన సామాన్య విప్రుని చరిత్రను సారంగు తమ్మయ్య మనోజ్ఞమైన వర్ణనలతో సుమధుర కావ్యంగా తీర్చిదిద్దాడు.

మన మాణిక్యాలు

రసబంధుర భక్తి కావ్యం

మానవ సమాజంలో ఎంతటి భక్తుడై నా, ఎంతటి సాధకుడైనా స్త్రీ వ్యామోహంలో పడి ఎట్లా పతనం అవుతాడో తెలుపుతూ, దేవదేవి విప్రనారాయణుల ప్రేమ సన్నివేశాల్లో సుమధుర శృంగార వర్ణన చేసిన కవి ఎక్కడా అతివేల శృంగారానికి తావివ్వలేదు. సందర్భోచితంగా వివిధ వర్ణనలు చేసినా అవి కూడా ఎక్కడా శ్రుతి మించి చెయ్యకపోవడం ఈ కావ్యం ప్రత్యేకత. అందుకే, ఈ కావ్యం అపురూప రసపోషణకు ఆటపట్ట యి, మధుర శృంగార రసబంధురమైన భక్తి కావ్యంగా రూపుదిద్దుకుంది. తనకన్నా ముం దు ఉండిన మహాకవుల గ్రంథ అధ్యయనాల కారణంగా ఇందులోని కథా నిర్వహ ణలోను, కల్పనా చాతుర్యంలోను కవి ప్రతి భ స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు సాహిత్యాకాశంలో వెలిగే ఒకానొక ప్రత్యేక తారగా నిలిచిపోయే ప్రతిభామూర్తి సారంగు తమ్మయ్య కవిశేఖరుడు.

-గన్నమరాజు గిరిజా మనోహరబాబు, 9949013448