calender_icon.png 14 May, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిగురించిన పాత స్నేహం!

13-04-2025 12:00:00 AM

తమిళనాట పాత మిత్రుల మధ్య మళ్లీ పొత్తు పొడిచింది. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో బీజేపీ కలిసి పోటీ చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పళనిస్వామి సారథ్యంలోనే ముందుకు పోతామనీ పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని గత కొన్ని రోజులుగా ఘంటాపథంగా చెప్పుకొచ్చిన పళనిస్వామి, అనూహ్యంగా కాషాయ పార్టీతో జత కట్టారు.

బీజేపీ దోస్తీ ప్రకటన శుక్రవారం వెలువడినా దానికి బీజం గత నెలలోనే పడినట్టు తెలుస్తోంది. పళనిస్వామి మార్చి 25న ఢిల్లీలో అమిత్‌షాతో సమావేశమైనప్పుడే పొత్తుపై ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ, పళనిస్వామి వాటిని కొట్టిపారేశారు. అమిత్‌షా ‘వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది’ అని చెప్పుకొచ్చారు. అమిత్‌షా మాటలతో తమిళనాడులో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోబోతోందన్న వార్తలకు బలం చేకూరింది.

దీనినే నిజం చేస్తూ బీజేపీ శుక్రవారం పొత్తపై ప్రకటన చేసింది. వాస్తవానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి పళనిస్వామి అంతగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. దానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై చేసిన వ్యాఖ్యలే ప్రధాన కారణం. అన్నాడీఎంకే నేతలు జయలలిత, సీఎన్ అన్నాదురైపై అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. ఆ విమర్శల కారణంగానే బీజేపీతో సుదీర్ఘ స్నేహాన్ని అన్నాడీఎంకే వదులుకుంది. బీజేపీ మధ్య మైత్రి 1998నుంచి ఉంది.

మాజీ ముఖ్యమంత్రి జయలలిత, ప్రధాని నరేంద్రమోదీ దేశ రాజకీయాల్లో కొంతకాలం కలిసి పనిచేశారు. 2019, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ పార్టీలు కలిసే పోటీ చేశాయి. జయలలితపై అన్నామలై అవినీతి ఆరోపణలు చేయడం వల్ల ఈ పార్టీలు దూరమై, 2024 సార్వత్రిక ఎన్నికల్లో విడిగా పోటీ చేశాయి. ఇది అంతిమంగా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకి కలిసొచ్చింది. డీఎంకే దాని మిత్రపక్షాలు 39 పార్లమెంటరీ స్థానాల్లో విజయం సాధించాయి.

ఒకరి ఓట్లు మరొకరు చీల్చుకోవడం వల్ల అన్నాడీఎంకే, బీజేపీలు ఆ ఎన్నికల్లో కనీసం ఖాతా తెరవలేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటునైనా గెలుచుకోలేక పోయినా ఆ పార్టీకి పోలైన ఓట్లు దాదాపు 7 శాతం పెరిగాయి. దీనికి ముఖ్య కారణం అన్నామలై విధానాలు. అయితే, చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్ల శాతాన్ని పెంచిన అన్నామలైని అన్నాడీఎంకేతో పొత్తు ప్రకటన చేయడానికి ముందే  పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించే ఏర్పాట్లను బీజేపీ చేసింది.

దీనిద్వారా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే అన్నామలైని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని పళనిస్వామి షరతు పెట్టారనే విషయం స్పష్టమవుతున్నది. తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం త్రిభాష విధానం, డీలిమిటేషన్, నీట్ వంటి అంశాలతో బీజేపీని తమిళ వ్యతిరేకిగా చూపుతున్నది. మరోవైపు నటుడు విజయ్ స్వంత పార్టీని ప్రారంభించారు.

ఈ పార్టీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి అసక్తిగా లేదు. ఈ తరుణంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, తిరిగి అది డీఎంకే అనుకూలంగా మారొద్దని అన్నాడీఎంకే భావించి బీజేపీతో పొత్తుకు అంగీకరించినట్టు అర్థమవుతున్నది. అయితే, నాయకులు పొత్తు పెట్టుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పాత విభేదాలు మరిచి కూటమి గెలుపునకు ఏ మేరకు కృషి చేస్తారన్నది కాలమే నిర్ణయిస్తుంది.