ఆమనగల్లులో బీజేపీ శ్రేణుల విజయ సంబరాలు
ఆమనగల్లు, మే 4 (విజయక్రాంతి): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించడం పట్ల ఆమనగల్లు పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. మూడు రాష్ట్రాల్లో పార్టీకి అనుకూలంగా ప్రజలు తీర్పునివ్వడంతో బిజెపి నాయకులు, కార్యకర్తలు పట్టణంలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై బిజెపి శ్రేణులు బాణాసంచా కాలుస్తూ, జై భారత్.. జై మోడీ అంటూ నినాదాలు చేశారు.
ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఓబిసి కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో భారతదేశం ప్రపంచ స్థాయిలో అన్ని రంగాల్లో దూసుకుపోతోందని, ఈ అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.
ప్రధాని పాలనపై నమ్మకంతోనే పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ప్రజలు ఎన్డీఏకు అఖండ విజయాన్ని కట్టబెట్టారని ఆయన వివరించారు. భవిష్యత్తులో కూడా ఇదే జోరు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మహేష్, వెంకటయ్య, మాజీ కౌన్సిలర్లు శ్రీశైలం యాదవ్, చెన్నకేశవులు, నాయకులు శ్రీకాంత్ సింగ్, గోరటి నరసింహ, పెద్దయ్య, కేకే, విక్రమ్ రెడ్డి, రవి రాథోడ్, గుజ్జరి శ్రీను, బ్రహ్మం, పార్టీ ముఖ్య కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.






