ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
మేడ్చల్, మే 4 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను అదనపు కలెక్టర్లు ఆదేశించారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విజయేందర్ రెడ్డి ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించారు.
వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 74 దరఖాస్తులను అధికారులు నేరుగా ప్రజల నుండి స్వీకరించారు. ఇందులో భూ సంబంధిత సమస్యలు, పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, స్థానిక మున్సిపల్ సమస్యలపై ప్రజలు విన్నవించుకున్నారు. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించిన అదనపు కలెక్టర్లు, ఆయా విభాగాల అధికారులతో ఫోన్ ద్వారా, నేరుగా మాట్లాడారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, నిబంధనల ప్రకారం అతి తక్కువ సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, ‘ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి, వాటి స్థితిగతులను నిరంతరం పర్యవేక్షిస్తామని క్షేత్రస్థాయి అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.






