05-08-2025 12:13:40 AM
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నల్లగొండ టౌన్, ఆగస్టు 4 : దేశంలో బిజెపి కోట్ల సంఖ్యలో ఓట్లను తొలగించే కుట్రను చేస్తుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీహార్ ఎన్ని కల నేపథ్యంలో ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆ రాష్ట్రంలో బిజెపి 65 లక్షల ఓట్లను తొలగించడం దారుణం అన్నారు.
పాకిస్తాన్ తో జరిగిన యుద్దాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చెబుతున్నా ప్రధాని మోడీ ఎందుకు ఖండిం చడం లేదని తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. అమెరికా మన మిత్ర దేశమని మోడీ పదేపదే ప్రకటనలు గుప్పిస్తున్నా ట్రంప్ మాత్రం భారతదేశంపై ద్వేషాన్ని కక్కుతూనే ఉన్నాడని ఆరోపిం చారు. భారతదేశ ఎగుమతులపై అమెరికా 25% సుంకాన్ని విధించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుందన్నారు.
పాకిస్తాన్ దేశానికి చెందిన అనీష్ మునీర్ ను ట్రంప్ తన ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వడం చూస్తుంటే ట్రంప్ ఈ దేశానికి ఎలా మేలు చేస్తాడని నమ్మాలని ఆయన ప్రశ్నించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సిపిఎం పార్టీ కట్టుబడి ఉంది అని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సభ్యులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాయకులు నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున పాల్గొన్నారు.