07-12-2025 12:52:48 PM
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నేతృత్వంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద రెండేళ్ల కాంగ్రెస్ నయవంచన పాలన పేరుతో బీజేపీ మహాధర్నాను నిర్వహించింది. ఎన్నికల హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విస్మరించిందంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నియంత పాలన, కుటుంబ పాలన చూశామన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, అంతేకాకుండా తెలంగాణ అప్పుల పాలైందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మాయ హామీలను నమ్మి ప్రజలు ఓటు వేశారని, ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారని ప్రశ్నించారు. ఉచిత బస్సు, సన్న బియ్యం తప్ప మరేవీ అమలు కాలేదని, రాష్ట్రంలో గులాబీ జెండా పోయి చేయి గుర్తు వచ్చిందంతే అని కేంద్రం మంత్రి వ్యంగ్యంగా మాట్లాడారు. దోపిడీలో మార్పు రాలేదు, ఏ వర్గంలోనూ మార్పురాలేదని ఆయన మండిపడ్డారు. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, హామీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. భూములు అమ్మకపోతే పథకాలు అమలు చేయలేదని పరిస్థితి రాష్ట్రానికి దాపురించిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబం పార్టీలే.. అక్రమాలకు పెద్దపీట అని, కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై బీజేపీ నాయకులు ఛార్జ్ షీట్ ను విడుదల చేశారు.