బీఆర్‌ఎస్, కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారాన్ని నమ్మొద్దు
బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్
నాగర్‌కర్నూల్, మే 9 (విజయక్రాంతి): కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రిజర్వేషన్లు, రాజ్యాంగం మార్పు అంటూ బీజేపీపై చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని నమ్మొద్దని నాగర్‌కర్నూల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లు కల్పించిన పార్టీ బీజేపీనేనని, రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను మార్చే హక్కు, అధికారం ఏ పార్టీలకు లేదన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ నిర్ణయం స్థిరంగా ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయక గ్రామీణ ప్రాంత ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నదని అన్నారు. ఎన్డీయే, ఇండియా కూటమిలో స్థానం లేని పార్టీ బీఆర్‌ఎస్ అని.. అసలు ఆ పార్టీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. దేశంలో 270 స్థానాల్లో పోటీలోనే లేని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందని అన్నారు. తాను ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంతానికి ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్, రైల్వేలైను సాధన కోసం కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో బీజేపీ నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






