18 April, 2026 | 8:27 PM

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరికి బిజెపి నిరసన

18-04-2026 07:17 PM

రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్న పోలీసులు

హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి వైఖరికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేశారు. బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు నాయకత్వంలో జరిగిన ఈ నిరసనలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ… మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ఎన్డీయే ప్రభుత్వం, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేశారని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ మహిళల అభ్యున్నతికి అడ్డుపడుతున్నాయని విమర్శించారు.

గతంలో పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును పలుమార్లు ప్రవేశపెట్టినా కాంగ్రెస్ పార్టీ సహకరించలేదని ఆరోపించారు. మహిళలను చట్టసభల్లోకి రానివ్వకుండా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మహిళలు కాంగ్రెస్ పార్టీ అసలు వైఖరిని అర్థం చేసుకుని తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. దేశ మహిళలను అవమానపరిచిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై నిరసన వ్యక్తం చేస్తే పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదని అన్నారు. ఇతర నేతల బొమ్మలు దహనం చేసినప్పుడు స్పందించని పోలీసులు ఇప్పుడు ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. చరిత్ర పుటల్లో మహిళల హక్కులకు వ్యతిరేకంగా నిలిచిన పార్టీగా కాంగ్రెస్ మిగిలిపోతుందని, మహిళలు ఆ పార్టీని ఇక విశ్వసించరని తెలిపారు.