03-12-2025 06:12:02 PM
- కౌలు రైతుల పంటను కొనాలి..
- తేమ పేరుతో కోత పెట్టద్దు..
- బిజెపి రాష్ట్ర నేత కొయ్యల ఏమాజి డిమాండ్..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): రైతులు పండించిన పత్తి పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని, తేమ పేరుతో ధరలో కోత పెట్టద్దని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్ చేశారు. బుధవారం తాండూరులో జిన్నింగ్ మిల్లులను బిజెపి నాయకులతో కలిసి పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట పూర్తిగా రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దిగుబడి రాక పెట్టిన పెట్టుబడి కూడా వెళ్లక రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు.
వ్యవసాయ అధికారులు కౌలు రైతుల పంటను ఎకరానికి నాలుగు క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్తున్నారని, రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రైతుల మొత్తం పంటను కొనుగోలు చేయాలని, ప్రైవేటు వ్యాపారులకు అమ్మితే రూ. 6500 మాత్రమే చెల్లిస్తున్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని అన్నారు. సీసీఐ, మార్కెటింగ్ శాఖ అధికారాలతో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పులగం తిరుపతి, శేషగిరి రావు, మండల అధ్యక్షులు భరత్ కుమార్, కృష్ణ దేవరాయలు, పుట్ట కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రవణ్ కుమార్, నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.