ఆయుష్ విద్యార్థులకు బీజేపీ మద్దతు
రాంచందర్ రావు
జూబ్లీహిల్స్, ఆగస్టు 19 (విజయక్రాంతి): అల్లోపతి విద్యార్థులతో సమానంగా తమకూ స్టైఫండ్ పెంచాలని ఆయుష్ హౌజ్ సర్జన్లు, పీజీ వైద్య విద్యార్థులు గత కొంత కాలం నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు.వారి సమ్మెకు తెలంగాణ బిజెపి కూడా మద్ధతును ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రాంచందర్ రావు సమ్మె నిర్వహిస్తున్న ఆయుష్ పీజీ వైద్య విద్యార్థులను బుధవారం కలిశారు. వారి డిమాండ్ కు మద్ధతునిస్తూ ఆందోళన పట్ల సంఘీభావాన్ని ప్రకటించారు.
అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ ఆ యుష్ హౌజ్ సర్జన్లు, పీజీ వైద్య విద్యార్థులకు చెల్లిస్తున్న స్టైఫండ్ లో దశాబ్ద కాలంగా పెద్ద మార్పు లేదన్నారు.అల్లోపతి విభాగం లో ఉన్న వైద్య విద్యార్థులతో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్న స్టైఫండ్ తో పోలిస్తే ఈ అసమానత మరింత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పొరుగు రాష్ట్రంలోని ఆ యుష్ వైద్యులకు అల్లోపతి వైద్యులతో దా దాపు సమానంగా స్టైఫండ్ అందుతోందని తెలిపారు.
తెలంగాణలో మాత్రం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయుష్ వైద్యులు, విద్యార్థుల డిమాండ్ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గత 16 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బిజెపి వారికి అండగా నిలుస్తుందని ప్రకటించారు. వారి న్యాయమైన డిమాండ్ల సాధనకు మద్ధతునిస్తుందని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






