20 August, 2026 | 2:37 AM

కార్యకర్తలే నాబలం.. పార్టీని మరింత బలోపేతం చేద్దాం

20-08-2026 12:08 AM
  1. గ్రామ గ్రామాన పర్యటించి ప్రజా సమస్యలపై పోరాడాలి
  2. కొల్చారం బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

కొల్చారం, ఆగస్టు 19 : కార్యకర్తలు లేనిదే ఏ నాయకుడూ లేరని, తన బలం.. బలగం అంతా కార్యకర్తలేనని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. కార్యకర్తలతో కలిసి గ్రామ గ్రామాన పర్యటిస్తూ ప్రజా సమస్యలపై పోరాడి బీఆర్‌ఎస్ను మరింత బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. బుధవారం కొల్చారం మండల కేంద్రంలోని బాబా గార్డెన్ ఫంక్షన్ హాల్లో బీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు గౌరీ శంకర్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు.

తాను అనుకున్న స్థాయిలో పనిచేయలేక పోయానని, ఇకపై కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీ సమావేశాలు, ర్యాలీలకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పార్టీకి అండగా నిలవాలని కోరారు. అందరూ కలిసి పనిచేస్తే విజయం తథ్యమని, ప్రజా తీర్పును శిరసావహించాల్సిందేనని పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమాన్ని కాంగ్రెస్ నిర్వీర్యం చేసింది

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిర్వీర్యమయ్యాయని సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు. గతంలో తెలంగాణను దేశంలోనే నంబర్వన్గా నిలిపేందుకు కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు కేసీఆర్ మానసపుత్రి కలని పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి

రైతు రుణమాఫీ, రైతుబీమా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతుబీమా ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులకు బీమా అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు.

సోషల్ మీడియాలో చురుకుగా ఉండాలి

కాంగ్రెస్ పార్టీ కుట్రల్లో భాగంగానే ఓటర్ల తొలగింపు జరిగిందని ఎమ్మెల్యే ఆరోపించారు. కార్యకర్తలు సోషల్ మీడియాలో మరింత చురుకుగా ఉండాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా దెబ్బతీస్తోందని విమర్శించారు. ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలను వివరించి ప్రభుత్వ వైఫల్యాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ఐక్యతే పార్టీకి ప్రధాన బలం

గ్రామ గ్రామాన పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలవాలని సునీత లక్ష్మారెడ్డి సూచించారు. కార్యకర్తల ఐక్యతే పార్టీకి ప్రధాన బలమని, అందరూ సమన్వయంతో పనిచేసి బీఆర్‌ఎస్ను మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు అరిగే రమేష్,  మాజీ ఎంపీపీ మంజుల కాశీనాథ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రవితేజరెడ్డి, ప్రధాన కార్యదర్శి దొడ్ల ఆంజనేయులు, యువజన విభాగం అధ్యక్షుడు సంతోష్రావు, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.