13న బీజేపీ ‘స్వచ్ఛ పాఠశాల’
- కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వినూత్న కార్యక్రమం
- బీజేపీ జిల్లా అధ్యక్షులు, మండలాధ్యక్షులతో బండి సంజయ్ భేటీ
కరీంనగర్, జూన్ 9 (విజయక్రాంతి): కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. “స్వచ్చ పాఠశాల” పేరుతో తన పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజవర్గాల్లోని అన్ని గ్రామాల్లోని ప్రాథమిక, ప్రాధమికొన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలలన్నింటిన్నీ పరిశుభ్రం చేయాలని నిర్ణయించారు.
“స్వచ్ఛ పాఠశాల” పేరుతో ఈనెల 13న ఆయా పాఠశాలలన్నింటినీ పరిశుభ్రం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని చైతన్యపురిలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని జిల్లాల అధ్యక్షులు, మండలాధ్యక్షులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమావేశమయ్యారు. మోదీ 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 15నుండి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వ పాఠశాలన్నింటినీ పరిశుభ్రం చేసి సుందరంగా ముస్తాబు చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గంలో 10న మండలాల వారీగా పార్టీ కార్యకర్తలంతా సమావేశమై ఒక్కో పాఠశాల వారీగా ఇంచార్జీలను నియమించాలని సూచించారు.
ఈనెల 11, 12 తేదీల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో “టిఫిన్ బైఠక్” పేరుతో సమావేశం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈనెల 16 ప్రతి గ్రామంలో “మీ పిల్లలను పాఠశాలల్లో చేర్చించండి” అనే నినాదంతో ఊరూవాడా ర్యాలీలు నిర్వహించాలని అన్నారు. దీనిపై విస్త్రత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
ఈ ఏడాది కూడా ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదివే విద్యార్థులకు మోదీ గిఫ్ట్ పేరుతో ఉచితంగా బ్రాండెడ్ సైకిల్ ను అందజేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి రికార్డు స్థాయిలో ఒకేసారి ఒకే టైంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులందరికీ సైకిళ్లను పంపిణీ చేద్దామని, అవసరమైతే గిన్నిస్ బుక్ రికార్డులో నమోదయ్యేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
నేడు మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు??
12 ఏళ్ల మోదీ పాలనను పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం ఉదయం కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.






