వచ్చేసారి అధికారం బీజేపీదే
- తెలంగాణలో ఇప్పుడు 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు
2019 అసెంబ్లీ ఎన్నికల్లో దీనిని 88 చేస్తాం
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి
కార్యకర్తలను కేంద్ర మంత్రులను చేసిన ఘనత బీజేపీదే
ఈ విజయం తెలంగాణ ప్రజలందరికీ అంకితం
ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): తెలంగాణలో 2029 అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు గెలిచిందని.. దీనిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 ఎమ్మెల్యేలకు పెంచుతామని తెలిపారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలకు హైదరాబాద్‌లో ఆ పార్టీ శ్రేణులు గురువారం ఘనస్వాగతం పలికాయి.
బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులంతా ఎంతో కష్టపడ్డారని, అందుకే తెలంగాణలో బీజేపీ 36 శాతం ఓట్లతో సత్తా చాటిందని అన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేల తరఫున తెలంగాణ ప్రజలకు శిరస్సు వచ్చి వందనం చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తెస్తామని దీమా వ్యక్తంచేశారు. ఇప్పటినుంచే పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో మరింత ముందుకు సాగుతామని అన్నారు.
కార్యకర్తల త్యాగాల ఫలితమే
కార్యకర్తల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన పార్టీ బీజేపీ అని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం కార్యకర్తలు అనేక పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. యువమోర్చా అధ్యక్షుడు నందరాజ్ గౌడ్, వీహెచ్‌పీ సభ్యులు పాపయ్య గౌడ్, దేవేందర్, జగిత్యాలలో జితేందర్‌రెడ్డి, నల్లగొండలో మైసయ్య గౌడ్ లాంటి అనేక మంది పార్టీకోసం ప్రాణాలర్పించారని అన్నారు.
కార్యకర్తల నుంచి కేంద్ర మంత్రులుగా
కిషన్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో ప్రస్థానాన్ని ప్రారంభించి 40 ఏళ్లుగా సేవలందించి కేంద్రమంత్రి అయ్యారని, బండి సంజయ్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి కార్పొరేటర్ నుంచి కేంద్రమంత్రి అయ్యారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. దేశం కోసం శ్రమించిన ఈ ఇద్దరి కృషిని గుర్తించి ప్రధాని మోదీ తన మంత్రివర్గంలో స్థానం కల్పించటం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇకపై రాష్ర్టంలో బీజేపీని అధికారంలోకి తేవటమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. రాబోయే ఐదేళ్లు మనకు విశ్వాస పరీక్ష అని కార్యకర్తలకు చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు మొదట ప్రాధాన్యత ఇచ్చి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు.






