19-07-2025 12:10:40 PM
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు(Local Elections) దగ్గర పడుతున్న వేళ బీజేపీలో వర్గపోరు మొదలైంది. దీంతో బీజేపీ కార్యకర్తలు(BJP workers) అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శామీర్ పేట లోని ఈటల రాజేందర్(MP Etela Rajender) ఇంటికి చేరుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గానికి వచ్చి మద్దతు తెలపాలని ఈటల కు విన్నవించారు. 25 ఏళ్లుగా ఈటల రాజేందర్ వెంట ఉన్నాయని హుజురాబాద్ శ్రేణులు చెబుతున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో తమకు సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
జిల్లాలో ఇతర బీజేపీ నేతల ఆధిపత్యంతో తమకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈటల వర్గాన్ని దూరం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కామెంట్స్ తో కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న బీజేపీ కేడర్ శనివారం ఈటల దగ్గరకు వెళ్లడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో రోజురోజుకి ఇద్దరు బీజేపీ అగ్రనేతల మధ్య వివాదం ముదురుతోంది. ఈటల వర్గానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనంటూ బండి సంజయ్ పరోక్షంగా హెచ్చరించిన విషయం తెలిసిందే. తనకు హుజురాబాద్‌లో తక్కువ ఓట్లు రావాలని కొందరు పనిచేశారన్న ఆయన వాళ్లకు టికెట్లు ఇవ్వమంటారా..? అంటూ పరోక్షంగా ఈటల వర్గంపై పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.