calender_icon.png 19 July, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

హుజూరాబాద్ బీజేపీలో వర్గపోరు...!

19-07-2025 12:28:17 PM

ఈటల వర్గం అసంతృప్తికి కారణం బండి వర్గమేనా.?

హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో(Huzurabad Constituency) నివురుగప్పిన నిప్పులా ఉన్న బీజేపీ వర్గపోరు తారాస్థాయికి చేరింది. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి సాధారణ, ఉప ఎన్నికల్లో 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల కెసిఆర్ కేబినెట్ లో రెండు పర్యాయాలు మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించారు. కాగా కెసిఆర్(Kalvakuntla Chandrashekar Rao) తో ఏర్పడిన విభేదాలతో టిఆర్ ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఈటల బీజేపీ లో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే అనంతరం 2028 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల హుజూరాబాద్ టు పాటు గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేసి రెండు స్థానాల్లో ఓడిపోయారు . ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీ గా పోటీ చేసిన ఈటల రాజేందర్ విజయం సాధించారు. అయితే కరీంనగర్ పార్లమెంట్ నుంచి గెలిచిన బండి సంజయ్ ఇదే నియోజకవర్గం లోని హుజూరాబాద్ పై కూడా ఆధిపత్యం చెలాయిస్తుండటం, ఈటల వర్గం అసహనం వ్యక్తం చేస్తుంది.

పార్టీ పదవుల్లో ఈటల వర్గానికి మొండి చెయ్యి చూపిస్తూ సంజయ్(Bandi Sanjay Kumar) తన వర్గానికి పెద్ద పీట వేస్తుండటం, మరో వైపు స్థానిక సమరానికి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే ఊహాగానాలతో ఈటల వర్గం తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నియోజక వర్గంలో సమావేశాలు నిర్వహించి తాడో పేడో తేల్చుకునేందుకు హైదరాబాద్ లోని ఈటల నివాసానికి అనుచర వర్గం శనివారం వెళ్లింది. అయితే ఈటల తన వర్గంలోని స్థానిక నేతలకు ఎలాంటి భరోసా ఇస్తారనే విషయంపై చర్చ సాగుతోంది. ఒకవైపు ఈటల అనుచరులు  రహస్య సమావేశాలు, మరోవైపు బండి వర్గం ఆధ్వర్యంలో జరిగిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమంతో రెండు వర్గాల మద్యం ఉద్రిక్తతకు దారి తీసింది.  ఈటల వర్గానికి చెందిన నాయకులకు ఆ కార్యక్రమంపై కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం, ఫ్లెక్సీల్లో ఈటల రాజేందర్ కు కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడం అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. ఈటల వల్లే బీజేపీకి గతంలో కన్న ఓట్ల శాతం పెరిగినప్పటికీ  ప్లెక్సీల్లో ఆయన ఫోటో కనిపించక పోవడంతో ఈటల అభిమానులు బండి వర్గ నాయకులతో వాగ్వాదానికి దిగారు. 

దీంతో ఈటల ఫోటోలతో కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదిలా వుండగా కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) గ్రూపులు కడితే టికెట్లు రావు అంటూ, ఈటల, సంజయ్ గ్రూపులంటూ లేవని ఒకే ఒకటి మోడీ గ్రూప్ మాత్రమే నని పరోక్షంగా ఈటల వర్గీయులకు చురకలంటించారు.  దీంతో ఈటలకు బీజేపీలో సారి అయిన ప్రాధాన్యత లభించినప్పుడు బీజేపీ లో కొనసాగడం వల్ల తమ రాజకీయ భవిష్యత్ కు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని, ఈ విషయంలో ఈటల తో చర్చించేందుకు హుజురాబాద్ నియోజక వర్గంలోని 1000 మంది వరకు షామీర్ పేట లోని ఈటల నివాసానికి చేరుకొని తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయితే ఈటల ఇచ్చే స్పష్టత పైన అక్కడి వెళ్లిన నాయకులు బీజేపీలో కొనసాగుతారా లేక ఇతర పార్టీలలో చేరుతారా అనేది ఆధారపడి ఉంది.