20-11-2025 12:00:00 AM
దిశా నిర్దేశం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్/హుజురాబాద్, నవంబర్19(విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది.హుజూరాబాద్ లో కరీంనగర్ పార్లమెంటరీ స్థాయి పోలింగ్ బూత్ అధ్యక్షులు, సోషల్ మీడియా వారియర్స్ సమావేశం బుధవారం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నాయకులకు, వారియర్స్ కు దిశా నిర్దేశం చేసారం రెండేళ్ల కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేలా కార్యాచరణను రూపొందించి సంతకాల సేకరణ ప్రారంభించారు.
డిసెంబర్ లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ప్రధానంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా సర్పంచ్, వార్డు స్థానాలను కైవసం చేసుకోవమే లక్ష్యంగా సమావేశంలో బండి సంజయ్ ఉపన్యాసం కొనసాగింది. ఇప్పటికే గ్రామాల వారీగా సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై సర్వేలు చేయిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్నికలను పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేశారు.సమావేశంలో ప్రధానంగా రెండు అంశాలపై బండి సంజయ్ చర్చించారు..
ఒకవైపు పంచాయతీ ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేస్తూనే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టేందుకు యాక్షన్ ప్లాన్ ను కూడా ప్రకటించారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనా విజయోత్సవాల పేరుతో ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా, అందుకు భిన్నంగా కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు జరిగిన అన్యాయాలపై కరపత్రాలను రూపొందించి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
హిందుత్వంతోనే బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే వాతావరణం తీసుకొస్తాం: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
ఎవరేమనుకున్నా హిందుత్వం మాట్లాడుతూనే ఉంటానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుండ బద్దలు కొట్టారు. నా నోటి నుండి హిందుత్వం ఆగిపోయిందంటే అదేరోజు నా శ్వాస ఆగిపోయినట్లేనని స్పష్టం చేశారు. హిందుత్వ నినాదాన్ని గడప గడపకూ తీసుకెళ్లి తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొచ్చి తీరుతామని స్పష్టం చేశారు. “పహల్గాంలో అవయవాలు చూసి హిందువులను కాల్చి చంపారు.
హైదరాబాద్ లో ముత్యాలమ్మ, పెద్దమ్మ ఆలయాలను కూల్చివేశారు. గోరక్షకులపై ముస్లింలు కాల్పులు జరిపారు. నిజామాబాద్ లో ముస్లిం వ్యక్తి కానిస్టేబుల్ ను చంపారు. డీసీపీ చైతన్యపై దాడి చేసింది ముస్లిం. మరి అట్లాంటప్పుడు హిందుత్వం మాట్లాడకుండా ఎందుకు ఉండాలి? తెలంగాణలో గత ఎన్నికల ముందు వరకు అధికారంలోకి దాదాపు వచ్చేసినంత వాతావరణ ఏర్పడిందంటే దానికి కారణం హిందుత్వమే అన్నారు.
జీహెచ్‌ఎంసీలో 4 కార్పొరేటర్లుంటే... 48 స్థానాలను గెలిచామంటే దానికి కారణమూ హిందుత్వమే. కరీంనగర్ లో నేను ఎంపీగా గెలిచానంటే హిందుత్వమే కారణమని గల్లా ఎగరేసుకుని చెబుతా”అని తెలిపారు. నరేంద్రమోదీ ప్రభుత్వం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా అందరికీ అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ ఎన్నికలొస్తే మసీదుల్లో ఇమామ్, మౌలానాలంతా ముస్లింలందరితో ప్రతిజ్ఝ తీసుకుని బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేయిస్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరారు.
హుజూరాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్ లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి పోలింగ్ బూత్ అధ్యక్షులు ఆ పైస్థాయి నాయకుల సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తోపాటు పార్టీ రాష్ట్ర సంఘటనా మంత్రి చంద్రశేఖర తివారీ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కరీంనగర్ ఇంఛార్జీ గంగిడి మనోహర్ రెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ వైఫల్యాలపై రూపొందించిన ‘కరపత్రం’తోపాటు సంతకాల సేకరణ పత్రాలను విడుదల చేశారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనా, బీఆర్‌ఎస్ పాలనా వైఫల్యాలపై ఈనెల 26న కరీంనగర్ పార్లమెంట్ పరధిలో ఇంటింటికీ వెళ్లి సంతకాల సేకరణ చేస్తామని ప్రకటించారు. కాషాయ సైనికుడు బండి సంజయ్ పై రూపొందించిన గీతాన్ని విడుదల చేసిన చంద్రశేఖర్ తివారీబలిరా...భళి భళిరే అంటూ సాగిన గీతానికి ఉత్సాహంతో చిందులేని బీజేపీకార్యకర్తలు