వంద పడకలకో బ్లడ్‌బ్యాంక్
- అందరూ రక్తదానం చేయాలి
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
రాజ్‌భవన్‌లో శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్/హైదరాబాద్ సిటిబ్యూరో, జూన్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో 100 పడకలున్న ప్రతి ప్రభుత్వ దవాఖానలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు కృషి చేస్తామని, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో ఈ అంశంపై మాట్లాడతానని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎక్కువ సంఖ్యంలో బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయడం వల్ల రక్తం అందుబాటులో ఉండటమే కాకుండా రక్తదానంపై ప్రజలకు మరింత అవగాహన కలగుతుందని తెలిపారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రాజ్‌భవన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాజ్‌భవన్ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రక్తదాతలకు ఆయన సర్టిఫికెట్లను అందించి వారిని అభినందించారు. రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలను అందరికీ వివరిస్తూ మరింతగా ప్రోత్సహించాలని కోరారు. రక్తదానం అనేది గొప్ప దార్శనీకతగా ఆయన అభివర్ణించారు. రక్తదానం చేస్తే ఏదో జరుగుతుందనే అపోహను వీడాలని విజ్ఞప్తి చేశారు. నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రాణాపాయంలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందితే వారికి పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుందన్నారు. తాను విద్యార్థి దశ నుంచే ప్రత్యేక సందర్భాల్లో రక్తదానం చేసినట్లు మంత్రి గుర్తు చేసుకున్నారు. అత్యధిక సార్లు రక్తదానం చేసిన వారిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
పన్ను మినహాయింపుపై సానుకూలం
బ్లడ్ బ్యాంక్ కోసం వినియోగించే వాహనాలకు రవాణా శాఖ తరఫున పన్నులు మినహాయించాలని రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు మంత్రి పొన్నంకు వినతి పత్రం అందించారు. వెంటనే స్పందించిన మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచిత బస్‌పాస్‌లు ఇచ్చే అంశంపై చర్చిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రెడ్‌క్రాస్ తెలంగాణ బ్రాంచ్ చైర్మన్ అజయ్ మిశ్రా, రాజ్‌భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి క్రిష్టినా జెడ్‌చోంగ్తు, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, రెడ్‌క్రాస్ తెలంగాణ కార్యదర్శి మదన్‌మోహన్‌రావు, గవర్నర్ సంయుక్త కార్యదర్శి భవానీశంకర్ పాల్గొన్నారు.






