మద్యానికి మంత్రి.. విద్యకే లేరు
బీజేపీ నేత రాణీ రుద్రమ
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నారు కానీ విద్యకే లేరని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ.. తెలంగాణకు విద్యా శాఖ మంత్రి నియమించాలని డిమాండ్ చేశారు. పుస్తకాలపైన పాత పాత సీఎం, విద్యాశాఖ మంత్రి పేర్లు ఉన్నాయని విద్యార్థులు చెప్పేవరకు బయటకురాని దుస్థితి తలెత్తిందన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాలకు డీఈఓలు లేరని, 62 డిప్యూటీ ఈవో పోస్టులకు గాను ఒక్కరూ లేరన్నారు. 617 మండలాలకుగాను కేవలం 17 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారని తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు కడిగేందుకు స్కావెంజర్లు లేక దుర్వాసనతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 22వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే నోటిఫికేషన్ ఇచ్చింది 11 వేలకు మాత్రమేనన్నారు.






