రమ్మీ ఆడుకుంటాం అనుమత్విండి
హైకోర్టులో ఎమ్మెల్యేస్ కాలనీ అసోసియేషన్ పిటిషన్
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): ఎమ్మెల్యే కాలనీలో ఏర్పాటు చేసుకున్న రిక్రియేషన్ సెంటర్లో 13 కార్డుల రమ్మీ, సిండికేట్ గేమ్‌లు ఆడుకొనేందుకు అనుమతిచ్చేలా పోలీసులకు ఉత్తర్వులు జారీ చేయాలని ఎమ్మెల్యేస్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ కార్యదర్శి కే రామచంద్రారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదే, జస్టిస్ జే అనిల్ కుమార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారించింది. ప్రతివాదులుగా ఉన్న పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.
12 కార్డుల రమ్మీ, సిండికేట్ గేమ్‌లు ఆడటానికి అనుమతించకపోవడం రాజ్యాంగంలోని 14, 19(1)(జీ), 21 ఆర్టికల్స్‌కు వ్యతిరేకమని పిటిషనర్ న్యాయవాది వాదించారు. తెలంగాణ గేమింగ్ చట్టానికి కూడా వ్యతిరేకమని చెప్పారు. రమ్మీలో సొసైటీ ఎలాంటి కమీషన్ వసూలు చేయ డం లేదని, లాభాలు ఆశించకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. రమ్మీ నైపుణ్యంతో కూడిన ఆటల పరిధిలోకి రాదని చెప్పి పోలీసులు నిషేధించడం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని చెప్పారు. వినోద కేంద్రం రిక్రియేషన్ సెం టర్ సొసైటీల చట్టం కింద రిజిస్టర్ అయిందని వివరించారు. సొసైటీలో 1,020 మంది సభ్యులున్నారని, ఎక్కువగా మాజీ/ ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రిటైర్డు జడ్జిలు, ప్రొఫెసర్లు, ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, బిల్డర్లు, వ్యాపారులు ఉన్నారని పేర్కొన్నారు.






