10-08-2025 12:23:15 AM
రాజకీయాల ముందు రక్తసంబంధాలు కూడా బలాదూర్ అని మరోసారి రుజువైంది. గతంలో రాజకీయాల కోసం సొంత అన్నదమ్ములే కుమ్ములాడుకున్న ఘటనలు కోకొల్లలు. కానీ కొన్ని చోట్ల అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య కూడా ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఎన్ని విబేధాలు ఉన్నా, రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలున్నా రాఖీ పండుగ రోజు మాత్రం రాఖీ కట్టి అన్న ఆశీర్వాదం తీసుకోవడం హిందూ సంప్రదాయంలో పరిపాటి.
అయితే ఈ రాఖీ పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ముందు రక్తసంబంధం ఓడిందనే చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ను విభేదిస్తూ ఆ పార్టీ నేతలపైనే విమర్శలు ఎక్కుపెట్టిన ఎమ్మెల్సీ కవిత ఈసారి తన సోదరుడు మాజీమంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టలేదు. ఇదే తీరుగా ఏపీలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సైతం తన సోదరుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు రాఖీ కట్టలేదు. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ ఒకే రక్తం రాజకీయం ముందు ఓడిపోయిందని ఈ రాఖీ పండుగ నిరూపించింది.
పెద్ది విజయ్‌భాస్కర్