10-08-2025 12:21:16 AM
- తమ నేతలను తిట్టడం కాదు
- కరీంనగర్‌లో సగం ఎంపీటీసీ సీట్లు గెలిచి చూపించు
- బీఆర్‌ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): కేంద్ర మంత్రి బండి సంజయ్ విసిరే సవాళ్లకు తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించరని, తాము చాలని బీఆర్‌ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు. పార్టీని భ్రష్టు పట్టించినందుకే బండిని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారని ఆయన చెప్పారు.
శనివారం తెలంగాణ భవన్‌లో మీడియ సమావేశంలో శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్‌లను అరెస్ట్ చేయాలని సంజయ్ అంటున్నారని, ఆయన అరెస్టు చేయమంటే చేస్తారా, న్యాయం, చట్టం లేవా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు లేవంటున్నట్లు పిచ్చి విషయాలు తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ నేతలను తిట్టడం కాదు, కరీంనగర్ సెగ్మెంట్‌లో కనీసం సగం ఎంపీటీసీ సీట్లు గెలిచి చూపించాలని సంజయ్‌కి సవాల్ విసిరారు. తమ పార్టీ ఎన్నటికీ ఖాళీ కాదని, గతంలో బీజేపీ నేతలు ఇట్లాగే అన్నారని, వాళ్ల పార్టీయే ఖాళీ అయిందని ఎద్దేవా చేశారు. చిల్లర మాటలు బంద్ చేసి రాష్ట్రానికి పనికి వచ్చే పనుల గురించి ఇప్పటికైనా ఆయన ఆలోచనలు చేస్తే మంచిదని హితవు పలికారు.
సంజయ్‌ని ఢిల్లీలో ఎవరూ గుర్తు పట్టరని, కేసీఆర్‌ను మమత గుర్తు పట్టలేదని అర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. డార్క్ సీక్రెట్స్ బయట పెడతా అంటున్నారని, ఆయన డార్క్ సీక్రెట్స్ కరీంనగర్ బీజేపీ కార్యకర్తలను ఎవరిని అడిగినా చెప్తారని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి కుటుంబాలను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు.