11-12-2025 08:26:38 PM
సిద్దిపేట క్రైం: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 విధించినట్టు పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 12న సాయంత్రం 5 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 7 గంటల వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం, కర్రలు, లాఠీలు, రాళ్లు, కొడవళ్ళు, గొడ్డళ్ళు వంటి ఆయుధాలను కలిగి ఉండడం నిషేధమన్నారు.
ఈ ఆంక్షలు అక్బర్పేట - భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూర్, దుబ్బాక, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావు పేట, సిద్ధిపేట రూరల్, సిద్ధిపేట అర్బన్, తోగుట మండలాల పరిధిలో అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బంది, అంత్యక్రియలు, అనుమతి పొందిన ఊరేగింపులు, కార్యక్రమాలకు ఆంక్షలలో మినహాయింపు ఉంటుందని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.