11-12-2025 08:19:29 PM
ఉప్పల్ లో యువకుడు సూసైడ్!
ఉప్పల్ (విజయక్రాంతి): ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా మరో యువకుడు బలయ్యాడు. ఉప్పల్ రామంతాపూర్ కు చెందిన అనిల్ సూసైడ్ చేసుకున్నాడు. ఆన్‌లైన్‌లో భారీ గణనీయమైన ఆర్థిక నష్టాలు చవిచూసి.. అవి తీర్చలేక ఫ్యానుకు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఒకవైపు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుసగా ఒక్కొక్కరిపై కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో డబ్బులు పోగొట్టుకుని.. అప్పులపాలై ఇంకొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ అనిల్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉప్పల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ కు చెందిన వల్లోజు అనిల్ కుమార్(38) ప్రైవేటు ఉద్యోగి ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. తరచూ బెట్టింగ్ ఆడటంతో దానికి బాగా బానిసయ్యాడు.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని లక్షల్లో అప్పలు చేసి బెట్టింగ్ ఆడాడు. కొంత వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత నష్టాలు రావడంతో కుమిలిపోయాడు. బుధవారం రోజున రాత్రి సుమారు పది గంట సమయంలో తండ్రి అయిన లక్ష్మణాచారి భోజనం చేసేందుకు అనిల్ ను పిలిచాడు. అనిల్ పైన ఉన్న తన గది నుండి ఎంతకీ బయటికి రాకపోవడంతో తన గదికి వెళ్లి చూడగా గదిలో అనిల్ సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని వేలాడుతూ కనబడ్డాడు. కుటుంబసభ్యుల సహాయంతో దగ్గర్లో ఉన్న మ్యాట్రిక్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అనిల్ పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. తన కుమారుడు బెట్టింగుల ఆడి అప్పులు చేశాడని అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని తన కొడుకు మరణంతో సంబంధం ఉన్న ఎవర్ని కూడా అనుమానించట్లేదని తండ్రి లక్ష్మణాచారి పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.