బోనమెత్తిన బోధన్ ఆర్డీవో
బోధన్ పట్టణంలో ఆరే కటికె సంఘం బోనాలు పండుగ
బోధన్, జూలై 21 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలో ఆరే కటికె సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బోధన్ ఆర్డీవో ఏం.విజయ కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె సాధారణ మహిళలతో కలిసి స్వయంగా బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు ఎత్తుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడగా, భక్తి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆరే కటికె సంఘం ప్రతినిధులు గంగారాం చౌదరి, రాజులాల్, మహేష్, రాజేందర్, రాజేశ్వర్, గంగా లాల్, మహేష్ మహిరాజ్ తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. స్థానిక భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు






