22-09-2025 01:58:18 PM
నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): మత్స్యకారులైన గంగపుత్రులు(బెస్త)లకు మాత్రమే బీసీ–ఏ "1" సర్టిఫికెట్లు ఇవ్వాలని, ఇతర కులాలకు జారీ చేసిన బోగస్ ధ్రువీకరణ పత్రాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో ఉమ్మడి జిల్లా బెస్త గంగపుత్ర సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్(District Additional Collector Amarender)ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చేర్క అంజయ్య మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్, లింగాల మండలం, బల్మూర్ మండలం కొండనాగుల, వెల్దండ మండలం చెరుకూరు, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లోనే సంప్రదాయ మత్స్యకారులైన బెస్తలు (బీసీ-ఏ "1") నివసిస్తున్నారని, మిగతా మండలాల్లో లేరని తెలిపారు. ఇకపై సర్టిఫికెట్లు జారీ చేసే సమయంలో గ్రామ గంగపుత్ర సంఘ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా పరిశీలించి మాత్రమే జారీ చేయాలని ఆయన కలెక్టర్ ని కోరారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని బెస్త గంగపుత్రుల హక్కులను కాపాడాలని సంఘం విజ్ఞప్తి చేశారు.