08-10-2025 01:22:32 AM
ఇస్లామాబాద్, అక్టోబర్ 7 : పాకిస్థాన్‌లో క్వెట్టా వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును లక్ష్యంగా చేసుకుని దుండగులు ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)బాంబులతో దాడి చేశారు. సింధ్ ప్రావిన్స్‌లోని షికాపూర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డా రని అక్కడి మీడియా పేర్కొంది.
అక్కడి సుల్తాన్‌కోట్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో రైల్వేట్రాక్‌పై అమర్చిన బాంబు పేలడంతో క్వెట్టాకు వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయని సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి, మిగతా ప్రయాణికులను సమీప స్టేషన్లకు తరలించి, ట్రాక్ మరమ్మతు పనులు ప్రారంభించినట్లు సుక్కూర్ డివిజనల్ అధికారి మోహసిన్ అలీ సియాల్ వివరించారు.
బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం సిద్ధించే వరకు..
అయితే, ఈ దాడి తమ పనే అని బలూచ్ రిపబ్లిక్ గార్డ్స్ ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్ సైన్యం రైలులో ప్రయాణిస్తున్న సమయంలో దాడి చేశామని, ఈ ఘటనలో అనేక మంది సైనికులు మరణించారని పేర్కొంది.
బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం వచ్చే వరకు ఇలాంటి దాడులు చేస్తూనే ఉంటామని హెచ్చరించింది. కాగా, ఈ ఏడాది మార్చి నుంచి ఈ రైలును లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వరుస దాడుల్లో ఇది తాజాదని, ఘటనలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని అక్కడి మీడియా పేర్కొంది.