08-10-2025 01:22:40 AM
-అమెరికాకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు పురస్కారం
-‘క్వాంటం’లో నూతన ఆవిష్కరణలకు కృషి చేసినందుకు ఈ అవార్డులు
-ప్రకటించిన స్టాక్‌హోంలోని రాయల్ స్విడీష్ అకాడమీ
-అక్టోబర్ 10న శాంతి, 13న ఆర్థిక శాస్త్రంలో పురస్కారాల ప్రకటన
ఇంటర్‌నెట్ డెస్క్: భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి-2025ని ప్రకటించారు. ఈ అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డును ముగ్గురు అమెరికన్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా గెలుచుకున్నారు. జాన్ క్లార్క్, మైఖేల్ హెచ్. డివోరెట్, జాన్ ఎం. మార్టినిస్లను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో మాక్రోస్కోపింగ్ క్వాంటం మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్‌లో ఆవిష్కరణకు గాను అమెరికాకు చెందిన జాన్‌క్లార్క్, మైఖేల్ హెచ్ డెవొరెట్, జాన్‌ఎం.మార్టినిస్‌లు ఈ అవార్డులు అందుకోనున్నారు.
అణువుల స్థాయిలో మాత్రమే సాధ్యమనుకున్న క్వాంటం భౌతికశాస్త్ర సూత్రాలను, కంటికి కనిపించేంత పెద్ద ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో విజయవంతంగా ప్రదర్శించినందుకు గాను వారికి ఈ గౌరవం దక్కింది.కాగా గతేడాది ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణకు గాను జాన్ జె.హోప్‌ఫీల్డ్, జెఫ్‌రీ ఈ హింటన్‌లు నోబెల్ పురస్కారాలను అందుకున్నారు.
మొత్తంగా 1901 మధ్యకాలంలో 118 సార్లు భౌతికశాస్త్రంలో నోబెల్‌ను ప్రకటించగా.. 226 మంది దీన్ని అందుకున్నారు.వీరిలో లారెన్స్ బ్రాగ్ 25 ఏళ్ల వయసులో నోబెల్ అందుకున్న వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. మరోవైపు సోమవారం(అక్టోబర్ 6న) వైద్యరంగంలో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 13 వరకు కొనసాగనుంది. బుధవారం రసాయనశాస్త్రం,గురువారం సాహిత్యం విభాగంలో విజేతలను ప్రకటించనున్నారు. అక్టోబర్ 10న శాంతి బహుమతితో పాటు 13న ఆర్ధికశాస్త్రంలో ఈ పురస్కారం అందుకోనున్న వారి పేర్లను ప్రకటిస్తారు.