24 July, 2026 | 3:02 AM

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

24-07-2026 12:00 AM
  1. ఆగంతకుల నుంచి వచ్చిన ఈమెయిల్
  2. పోలీసుల ముమ్మర తనిఖీలు

రాజేంద్రనగర్, జులై 23(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (శంషాబాద్) మరోసారి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. టేకాఫ్ అయిన ఒక విమానంలో బాంబు ఉందంటూ గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈ-మెయిల్ ద్వారా ఈ హెచ్చరిక వచ్చింది. వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

సీఐఎస్‌ఎఫ్ అధికారులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి విమానాశ్రయ ప్రాంగణంలోనూ, కీలక ప్రాంతాల్లోనూ విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు టేకాఫ్ అయిన విమానంలో బాంబు ఉందనే హెచ్చరికతో, అప్పటికే బయలుదేరిన విమానాల సిబ్బందికి కూడా వెంటనే సమాచారం అందించి భద్రతా చర్యలు చేపట్టారు.  ఈఎయిర్‌పోర్టుకు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేకసార్లు ఇలాంటి హెచ్చరికలు రాగా, విచారణలో అవి ఆకతాయిలు చేసిన ఉన్మాద పనులుగా తేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు  దర్యాప్తు వేగవంతం చేశారు.