నీట్ పేపర్ లీకేజీపై భగ్గుమన్న కాంగ్రెస్
నకిరేకల్‌లో ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో భారీ నిరసన
కట్టంగూర్, జూలై 23 : నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మెయిన్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. దేశంలో కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని, నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం, విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీయడమేనని మండిపడ్డారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతిపక్షాలపై కక్షపూరిత చర్యలు మానుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు చామల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజులమాధవ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాదగోని కొండయ్య, టౌన్ అధ్యక్షుడు లింగాల వెంకన్నలతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువజన నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






