‘దేశం కార్పొరేట్లకు’ పుస్తకావిష్కరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 2 (విజయక్రాంతి) : విరసం ఆధ్వర్యంలో ప్రచురించిన ‘దేశం కార్పొరేట్లకు కగార్ యుద్ధంలో హిందుత్వ ఫాసిస్టు యుద్ధం’ అనే పుస్తకావిష్కరణ సభ గురువారం నగరంలోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. విరసం అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రొఫెసర్లు లక్ష్మణ్, సమున్నతతో పాటు ఎన్ రవి మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్ పేరిట నాలుగు నెలలుగా 92 మంది ఆదివాసులు, మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం హత్య చేసిందని ఆరోపించారు.
మావోయిస్టుల నిర్మూలన అని పైకి చెబుతున్నప్పటికీ దేశ ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టడమే కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని విమర్శించారు. రాజకీయంగా, సైద్దాంతికంగా తమకు ప్రత్యర్థి అయిన మావోయిస్టు ఉద్యమ నిర్మూలనే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్‌ను హిందూ దేశంగా మార్చాలన్న వారి ప్రణాళికకు మావోయిస్టు ఉద్యమం అడ్డంకిగా ఉన్నందునే కగార్ యుద్ధాన్ని తీసుకు వచ్చారని ఆరోపించారు.




