25 March, 2026 | 2:32 AM

రెండు గంటల్లోనే బాలుడి ఆచూకీ లభ్యం

25-03-2026 12:59 AM

మొయినాబాద్, మార్చి 24 (విజయ క్రాంతి): ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి తప్పిపోయిన ఐదేళ్ల బాలుడిని కేవలం రెండు గంటల్లోనే గుర్తించి తల్లికి క్షేమంగా అప్పగించారు.వివరాల్లోకి వెళ్తే& అనిరుధ్ అనే ఐదేళ్ల బాలుడిని అతని తల్లి రోజువారీ కూలీ పనికి వెళ్లే సమయంలో పరిచయస్తుల వద్ద ఉంచింది.

అయితే బాలుడు ఆడుకుంటూ ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్లి వీధుల్లో తిరుగుతుండగా, అదే సమయంలో అతని అక్క పిన్ని ఇంటి వద్ద ఉండి పదో తరగతి పరీక్షలు రాస్తోంది. తమ్ముడు రోడ్డుపై ఒంటరిగా తిరుగుతుండటాన్ని గమనించిన ఆమె, అతన్ని ఆటోలో తీసుకుని తన వద్దకు తీసుకెళ్లింది.ఇదిలా ఉండగా, పని ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లికి బాలుడు కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించింది.

వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బాలుడు షేర్ ఆటోలో వెళ్లినట్లు గుర్తించిన క్రైమ్ పీసీ కరుణాకర్, సంబంధిత డ్రైవర్ను సంప్రదించి బాలుడి ఆచూకీని గుర్తించారు.తరువాత బాలుడు తన అక్క వద్ద సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించి, కేవలం రెండు గంటల్లోనే తల్లికి అప్పగించారు. వేగంగా స్పందించి బాలుడిని క్షేమంగా అప్పగించిన పోలీస్ సిబ్బందిని బాలుడి తల్లి హృదయపూర్వకంగా అభినందించారు.పోలీసులు తల్లిదండ్రులకు పిల్లలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112 కు కాల్ చేయాలని కోరారు.