రఘునాథ బంజర యూపీఎస్‌లో అల్పాహార పథకం ప్రారంభం
పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహార బలోపేతం
కల్లూరు,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అల్పాహార పథకాన్ని కల్లూరు మండలంలోని రఘునాథ బంజర యూపీఎస్ పాఠశాలలో ఘనంగా ప్రారంభించారు. గ్రామ పెద్దలు కుక్క రానా,కర్నాటి రామకృష్ణారెడ్డి,పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటికే నోట్ పుస్తకాలు,యూనిఫాంలు, మధ్యాహ్న భోజన పథకం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని,ఇప్పుడు అల్పాహార పథకం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ఈ పథకం విద్యార్థుల హాజరు పెరగడమే కాకుండా చదువుపై ఆసక్తిని పెంపొందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు.ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ,విద్యార్థుల పట్ల ఉన్న ఆప్యాయతకు ఇది నిదర్శనమని వారు అన్నారు.విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే మెరుగైన విద్యను అందిపుచ్చుకుంటారని తెలిపారు.






