బడిబాటతో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు
మంత్రి కొండా సురేఖ
మెదక్, జూన్ 19 (విజయక్రాంతి): బడిబాట కార్యక్రమం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రొఫె సర్ జయశంకర్ బడిబాటలో భాగంగా బుధవారం మెదక్ జిల్లా కొల్చారం జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్థిక, సామాజిక తేడాలను తగ్గించేది విద్య మాత్రమేనని తెలిపారు.
అనంతరం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న ఐదేళ్లు పైబడిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఎంపీపీ భవనాన్ని వారు ప్రారంభించారు. పోతంశెట్టిపల్లి గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ బాలస్వామి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఈవో రాధాకృష్ణ, డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, ఎంపీటీసీ అరుణ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల గొడవ..
బడిబాటలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని బీఆర్‌ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ప్రొటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు మాత్రమే స్టేజీపై కూర్చోవాల్సి ఉండగా.. ఏ హోదాతో కాంగ్రె స్ నాయకులు కూర్చుంటున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నించారు. ఈ వ్యవహార మంతా మంత్రి, కలెక్టర్ సమక్షంలోనే జరిగింది. ఒకదశలో తోపులాట కాస్త ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చెదరగొట్టారు.
బడిబాటపై మెదక్ కలెక్టర్ పాట..
బడిబాటపై మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పాట రాయగా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీతారెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. కలెక్టర్ స్వయంగా పాట రాసి, కూర్పు చేసి, ట్యూన్స్ అందించడంతో మంత్రి అభినందించారు.
చెక్కుల పంపిణీ..
నర్సాపూర్, జూన్ 19: నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి మంత్రి కొండా సురేఖ లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం..
కొల్చారంలో బడిబాట రసాభాసగా మారడంతో అక్కడి నుంచి నూతనంగా నిర్మించిన ఎంపీపీ భవన ప్రారంభోత్సవానికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. అక్కడ కూడా మంత్రితో పాటు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేయడానికి ప్రయత్నించగా మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మంత్రి సురేఖ స్పందించి సంయమనం పాటించాలని కార్యకర్తలకు సూచిస్తూ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభోత్సవం చేశారు.






