7 April, 2026 | 12:39 AM

బ్రోకర్ల ఇష్టారాజ్యం!

02-12-2024 12:14 AM
  1. పటాన్‌చెరు ఆర్‌టీఏ ఆఫీసులో బ్రోకర్ల తిష్ట
  2. రిజిస్ట్రేషన్లునా, డ్రైవింగ్ లైసెన్స్‌లైనా వారిదే హవా
  3. ప్రతీ పనికి ఇంతా అని రేట్లు ఫిక్స్
  4. నేరుగా వెళ్తే సవాలక్ష సమస్యలు

పటాన్‌చెరు, డిసెంబర్ 1: పటాన్‌చెరు ఆర్‌టీఏ కార్యాలయంలో బ్రోకర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. కార్యాలయంలో ఏ పని కావాలన్నా వారిని సంప్రదించాల్సిందే. కార్యాలయం ముందున్న చెట్లే వీరి అడ్డాలు. నేరుగా అధికారుల వద్దకు వెళ్తే బ్రోకర్ల ద్వారా జరిగినంత వేగంగా సామాన్య ప్రజలకు పనులు జరగవు.

అధికారుల సహకా రంతోనే బ్రోకర్లు మరింత రెచ్చిపోయి ప్రతి పనికి ఇంత అని రేట్లు పెట్టిమరీ వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. వాహనాల ఫిట్‌నెస్ చేయించాలన్నా,  డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకోవాలన్నా, వాటిని రెన్యూవల్ చేసుకోవాలన్నా ఇతర ఏ పనుల కోసమైనా బ్రోకర్లను సంప్రదించకు ండా నేరుగా కార్యాలయానికి వెళ్తే పనులు జరుగవు. ఒకవేళ ఎవరైనా నేరుగా వెళ్తే సవాలక్ష కారణాలు చూపిస్తారు.

ఫైల్‌ను పక్కనపడేస్తారు. పనికోసం కార్యాల యం చుట్టూ తిరుగతూనే ఉండాలి. అదే బ్రోకర్లను సంప్రదించి వారి అడిగినంత ముట్టచెబితే పనులు క్షణాల్లో జరిగిపోతాయి. 

పనిని బట్టి రేట్లు ఫిక్స్..!

వాహనాలకు సంబంధించిన పనుల కోసం వచ్చిన ప్రజలు.. అధికారులను కలిసేందుకు క్యూలైన్‌లో వేచి ఉంటే బ్రోకర్లు మాత్రం నేరుగా అధికారుల దగ్గరకు వెళ్లి కాగితాలపై సంతకాలు చేయిం చుకొని వెళ్తుంటారు.  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాం.. రూల్స్ ప్రకారం వెళ్తాం అం టే ఇక్కడ కుదరదు. అధికారుల వద్దకు నేరుగా వెళ్లిన తిరిగి బ్రోకర్లను సంప్రదించాల్సిందే.   

డ్రైవింగ్ లైసెన్స్‌కు ఒకరేటు, ఫిట్‌నెస్‌కు ఒకరేటు ఇలా పనిని బట్టి రేట్లు ఫిక్స్ అయ్యి ఉంటాయి. వేగంగా పని కావాలంటే వారు నిర్ణయించిన రేటు చెల్లించాల్సిందే. ప్రజాప్రతినిధులు వారి పలుకుబడితో లంచాలు లేకుండా పనులు చేయించుకుంటారు.

ఎటొచ్చి సామాన్య ప్రజలకే సవాలక్ష సమస్యలు ఎదురువుతున్నాయి. ఏసీబీ అధికారులు దృష్టిసా రించి పటాన్‌చెరు ఆర్‌టీఏ కార్యాలయంలో బ్రోకర్ల బెడద తీర్చడంతో పాటు దరఖాస్తుదారులకు నిర్ణీత సమయంలోపు పనులు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.