03-12-2025 12:00:00 AM
-అన్న మద్దతు ఇవ్వడం లేదని గడ్డి మందు తాగిన తమ్ముడు...
- ప్రాణానికి హాని తెచ్చిన సర్పంచ్ ఎన్నికలు
సిద్దిపేట, డిసెంబర్ 2 (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికలలో తోడబుట్టిన అన్న తమకు మద్దతు ఇవ్వడంలేదని మనస్తాపం చెందిన సర్పంచ్ అభ్యర్థి గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్ గ్రామంలో మంగళవారం జరిగింది.
గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఘనపూర్ గ్రామం సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్ కేటాయించారు. గ్రామ సర్పంచ్ పదవి కోసం ఆ గ్రామంలో ముగ్గురు ఎస్సీ వర్గనికి చెందిన అభ్యర్థులు నామినేషన్ వేశారు. అందులో మాజీ ఉపసర్పంచ్ గణపురం ఎల్లయ్య సర్పంచ్ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ వేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కుటుంబీకులను కలిసేందుకు ఇంటింటికి తిరుగుతూ తన సొంత అన్న మాజీ సర్పంచ్ బాల్ నరసయ్యను కలిసి మద్దతు తెలిపామని కోరగా, తాను ఇతరులకు మాట ఇచ్చాను నీవే పోటీ నుంచి తప్పుకోమని అన్న సూచించడంతో మనస్థాపానికి గురైన సర్పంచ్ అభ్యర్థి ఎల్లయ్య గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఎల్లయ్య గడ్డి మందు తాగిన విషయాన్ని గుర్తించిన కుటుంబీకులు చికిత్స కోసం వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సర్పంచ్ ఎన్నికలు ప్రాణానికి హాని తెచాయని కుటుంబ సభ్యులు విలపించారు.